Sep 27,2023 00:06

ఎఎంసికి పార్థివ దేహాన్ని అప్పగిస్తున్న సత్యనారాయణ కుటుంబీకులు, సిపిఎం, సిఐటియు నాయకులు

ప్రజాశక్తి - సింహాచలం : సిఐటియు నాయకులు పైడా సత్యనారాయణ చిరస్మరణీయుడని, ఆయన మృతి ప్రజా, కార్మిక ఉద్యమాలకు తీరని లోటు అని పలువురు వక్తలు అన్నారు. సోమవారం గుండెపోటుతో కన్నుమూసిన సత్యనారాయణ సంతాప సభ అప్పన్నపాలెంలోని వారి స్వగృహం వద్ద మంగళవారం జరిగింది. తొలుత ఆయన మృతికి పలువురు నివాళ్లర్పించారు. సంతాప సభలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ సత్యనారాయణ భవన నిర్మాణ కార్మిక సంఘాన్ని స్థాపించి వారి హక్కులపై నిరంతరం పోరుబాట సలిపారన్నారు. నీతి, నిజాయితీకి మారుపేరుగా నిలిచారని గుర్తుచేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ మాట్లాడుతూ బిహెచ్‌పివిలో ఉద్యోగ విరమణ అనంతరం సత్యనారాయణ సింహాచలం ప్రాంతంలోని సమస్యలపై పోరాడారన్నారు. పంచగ్రామాల సమస్యపై జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారన్నారు. నిరంతరం శ్రమజీవుల పక్షాన నిలిచారని కొనియాడారు. సిపిఎం 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు మాట్లాడుతూ నిబద్ధత కలిగిన కార్యకర్తగా, నాయకునిగా సత్యనారాయణను పేర్కొన్నారు. సిపిఎం గోపాలపట్నం జోన్‌ కార్యదర్శి బి.వెంకటరావు అధ్యక్షతన ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి, శేషారత్నం, సత్యనారాయణ సహచరులు నానాజీరావు, వెంకటరావు తదితరులు మాట్లాడారు. సత్యనారాయణ భార్య సూర్యకాంతాన్ని, కుటుంబీకులను పలువురు పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిపిఎం నాయకులు బి.రమణి, ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, బిహెచ్‌పివి సిఐటియు నాయకులు ప్రకాష్‌, సిఐటియు నాయకులు జ్యోతీశ్వరరావు, ఎంవి.ప్రసాదరావు, వి.ప్రభావతి, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఎఎంసికి పార్థివ దేహం అప్పగింత
సత్యనారాయణ పార్థివ దేహాన్ని విద్యార్థుల పరిశోధనార్థం ఆంధ్రా మెడికల్‌ కాలేజీకి ఆయన కుటుంబ సభ్యులు, సిపిఎం, సిఐటియు నాయకులు అప్పగించారు.