
ప్రజాశక్తి -గాజువాక : పైడా సత్యనారాయణ చిరస్మరణీయుడని వక్తలు పేర్కొన్నారు. అరుణోదయ కళాసమితి ఆధ్వర్యాన బుధవారం సాయంత్రం మింది గ్రామంలో సంతాప సభ నిర్వహించారు. సత్యనారాయణ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జోన్ కార్యదర్శి ఎం.రాంబాబు మాట్లాడుతూ, కార్మిక, ప్రజల రాజ్యం రావాలని కోరుకుంటున్న కమ్యూనిస్టు పార్టీలో సత్యనారాయణ చివరి వరకు పనిచేశారని తెలిపారు. ఒకపక్క ఉద్యోగం చేస్తూ మరోపక్క కార్మిక సమస్యలపై పోరాడారన్నారు. ప్రస్తుత పాలకుల విధానాల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సిఐటియు నాయకులు ఎస్.జ్యోతీశ్వరరావు మాట్లాడుతూ, కార్మిక హక్కుల కోసం, కార్మికుల పట్ల అంకితభావంతో పనిచేసే వ్యక్తి సత్యనారాయణ అన్నారు. సిపిఎం గోపాలపట్నం డివిజన్ కార్యదర్శి వెంకటరావు మాట్లాడుతూ, ఎల్జి పాలిమర్స్ దుర్ఘటన సమయంలో సత్యనారాయణ, తాను కలిసి చేసిన పనిని ఒకసారి గుర్తుచేసుకున్నారు. ఎల్‌జి పాలిమర్స్ భూములను అదానికి అమ్మాలని చూస్తున్నారని, దీనిపై వెంకటాపురం గ్రామస్తులు ఆందోళనకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. వైసిపి నాయకులు గుడివాడ అప్పలరామ్మూర్తి మాట్లాడుతూ అంకితభావం కలిగిన వ్యక్తి సత్యనారాయణ అన్నారు. బిహెచ్‌పివిలో తాను, సత్యనారాయణ కలిసి స్టోర్‌లో పనిచేశామన్నారు. డ్యూటీలో నిబద్ధతతో ఉండేవారని చెప్పారు. అరుణోదయ కళా సమితి అధ్యక్షులు రెడ్డిపల్లి నానాజీ అధ్యక్షతన జరిగిన సంతాప సభలో ఈటి శ్రీరాములు, వరి వెంకటరావు, పైడా సత్యనారాయణ సతీమణి సూర్యకాంతం, సిగటాపు అప్పలరాజు పాల్గొన్నారు.