జూన్ మూడో వారం ముగుస్తున్నా జాడలేని వాన
నైరుతి రుతుపవనాల మందగమనంతో వడగాల్పుల జోరు
నారుమడులు వేసేందుకు రైతులు ముందుకు రాలేని పరిస్థితి
ఖరీఫ్ సాగు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి
కౌలురైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు వెనుకంజ
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
చినుకు జాడ కోసం అన్నదాత కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. వర్షం కురిస్తే తప్ప ఖరీఫ్ సాగు ముందుకు సాగే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో చినుకు పడేదెప్పుడు.. విత్తు నాటేదెప్పుడు అంటూ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జూన్ మూడోవారం ముగుస్తున్నా ఇప్పటికీ వర్షం జాడ లేకుండాపోయింది. నైరుతి రుతుపవనాలు మందకొడిగా కదులుతున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. రోజురోజుకీ వడగాల్పులు పెరిగిపోతుండటంతో నారుమడులు వేయాలంటేనే రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రెండు జిల్లాల్లోనూ దాదాపు మూడు లక్షలకుపైగా ఎకరాల్లో రైతులు ఖరీఫ్‌సాగుకు సన్నద్ధమయ్యారు. విత్తనాలు సిద్ధం చేసుకుని ఖరీఫ్ సాగుకు నారుమడులు వేసేందుకు రైతులు ఎదురుచూస్తున్నారు. జూన్ ఒకటో తేదీన కాలువలకు సాగునీరు విడుదల చేసినా ఇప్పటి వరకూ రైతులు నారుమడులు వేయలేని పరిస్థితి నెలకొంది. అందుకు ప్రధాన కారణం వానలు కురవకపోవడమే. పంట కాలువలకు సాగునీరు విడుదల చేసినా వానలు లేకపోవడంతో వడగాల్పుల తీవ్రత ఏమాత్రం తగ్గలేదు. రోజురోజుకీ వడగాల్పులు పెరుగుతున్నాయే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. వాన కురిస్తే తప్ప భూమి చల్లబడే పరిస్థితి లేకుండాపోయింది. ఈ తరుణంలో నారుమడులు వేసినా వడగాల్పులకు మొలకలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అదే జరిగితే రెండోసారి నారుమడులు వేయాల్సిన దుస్థితి ఏర్పడనుంది. రైతు నెత్తిపై అదనపు పెట్టుబడి భారం పడనుంది. దీంతో రైతులు నారుమడులు వేసేందుకు ముందుకు రావడం లేదు. నారుమడులు సకాలంలో వేసే అవకాశం లేకపోవడంతో ఖరీఫ్ సాగు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే జూన్ నెలాఖరుకుగాని నారుమడులు పడే పరిస్థితి కన్పించడం లేదు. అదే జరిగితే జులై 25వ తేదీ తర్వాతగాని ఖరీఫ్ నాట్లు ప్రారంభమయ్యే అవకాశం ఉండదు. దీంతో ఖరీఫ్ మాసూళ్లు ఆలస్యంగా వచ్చే పరిస్థితి ఉంది. ఈ పరిణామాలతో రబీ సాగు సైతం మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడనుంది. సకాలంలో వర్షాలు రాకపోవడంతో ఈ ఏడాది సాగుపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది.
కౌలురైతులకు రుణాలిచ్చేందుకు ముందుకురాని బ్యాంకులు
జిల్లాలో 70 శాతానికిపైగా వ్యవసాయ సాగు కౌలురైతులే చేస్తున్నారు. ఖరీఫ్‌సాగు ప్రారంభించేందుకు రైతులు సన్నద్ధంగా ఉన్నప్పటికీ కౌలురైతులకు రుణార్హత కార్డులుగాని, పంటరుణాలుగాని అందని దుస్థితి నెలకొంది. ఈ నెల 16వ తేదీన జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ గతేడాది కౌలురైతులకు 50 వేల వరకూ రుణార్హత కార్డులు ఇచ్చామని, రైతులందరికీ పంటరుణాలు పొందే అర్హత ఉన్నప్పటికీ బ్యాంకులు కేవలం 20 శాతానికి మించి కౌలురైతులకు పంటరుణాలు అందించలేదని అన్నారు. దీన్ని బట్టి కౌలురైతు పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్న కౌలురైతుల పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని స్పష్టమవుతోంది. ప్రస్తుత ఖరీఫ్‌లోనూ కౌలుకార్డుల జారీ ప్రక్రియ సైతం తూతూమంత్రంగా సాగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఏడాదైనా కౌలు రైతులందరికీ రుణార్హత కార్డులు, రుణాలు ఇచ్చేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేకపోతే కౌలురైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.










