ప్రజాశక్తి - చిలకలూరిపేట : ఎన్ని కష్టనస్టాలున్నా తట్టుకుని రైతులు పెట్టుబడులకు డబ్బులు సమకూర్చుకున్నారు. కౌలురైతులు అక్కడా ఇక్కడా అప్పులు తెచ్చి కౌలు చెల్లించి పొలాలు తీసుకున్నారు. అయితే వానలు మాత్రం మొహం చాటేయడంతో వ్యవసాయం ముందుకు సాగడం లేదు. గతేడాదికంటే సగానికి పైగా పొలం సాగు నోచకపోగా మొత్తం సాగు భూమిలో సుమారు సగం వరకూ భూమి ఖాళీగా పడి ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులు, కౌలురైతులు సాగు చేయకుండానే నష్టపోయే అవకాశం ఉండగా కూలీలు పనుల్లేక ఆర్థిక ఇబ్బందుకుల చేరువ కానున్నారు.
చిలకలూరిపేట మండలంలో పత్తి, మిర్చి పొగాకు, శనగలు ప్రధాన పంటలు కాగా ఇతర కూరగాయాలు, అపరాలు అక్కడడక్కడా పరిమితంగా సాగవుతుంటాయి. మండలంలో మొత్తం సాగువిస్తీర్ణం 18 వేల ఎకరాలు కాగా పత్తి గతేడాది మాదిరే 2,500 ఎకరాల్లో సాగైంది. మిర్చి గతేడాది 2,800 ఎకరాల్లో సాగవగా ప్రస్తుతం వెయ్యి ఎకరాల్లోనే సాగైంది. వర్షాలు పడితే మరో వారం రోజుల వరకూ మిర్చి సాగుకు అవకాశం ఉండి మరో వెయ్యి ఎకరాల్లో సాగవుతుందని అంచనా. పత్తి సాగుకు సమయం ఇప్పటికే మించిపోయింది. 5 వేల ఎకరాల్లో పొగాకు, శనగ పంటలు సాగుచేస్తుంటారు. ఆక్టోబర్ చివరి వారం నుండి వీటి సాగు ప్రారంభం అవుతుంది. అయితే వేమవరం, మురికిపూడి, రామచంద్రపురం, కొత్తరాజాపేట తదితర గ్రామాల్లోని 1500 ఎకరాల్లో పొగాకు నారుమళ్లు వేశారు. ఎకరా నారుమడి 700 ఎకరాల సాగుకు సరిపోతుంది. మండలంలో ప్రతిఏడాదీ సుమారు 1100 ఎకరాల్లోనే పొగాకు సాగువుతుంది. మిగతా నారును ఇతర ప్రాంతాలకు విక్రయిస్తుంటారు.
మొత్తంగా మండలంలోని 18 వేల ఎకరాల సాగుభూమిలో 5 వేల ఎకరాల్లో పొగాకు, శనగ సాగు అక్టోబర్‌లో మొదలవుతుంది. మిగతా 13 వేల ఎకరాల్లో ఇప్పటి వరకు పత్తి, మిర్చి, సోయా తదితర పంటలు సుమారు 4 వేల ఎకరాల వరకూ సాగయ్యాయయి. ఇంకా 9 వేల ఎకరాల భూమి ఖాళీగా ఉంది. ఇది మొత్తం సాగు భూమిలో సగం. గతేడాది ఇదే సమయానికి 8 వేల ఎకరాల వరకూ సాగు పూర్తవగా ఈ ఏడాది వర్షాలు లేని కారణంగా ఏ పంటలు వేయాలో రైతులకు పాలుపోవడం లేదు.
చిలకలూరిపేట మండలంతోపాటు నియోజకవర్గంలో మొత్తం సాగు భూమిలో 80 శాతం పొలాలు వర్షాధారంగా సాగయ్యేవే. మిగతా 20 శాతం పొలాలు మాత్రమే సాగర్ కాల్వలు, బోర్లు, చిలకలూరిపేట పట్టణంలోని డ్రెయినేజీ కాల్వ కింద సాగవుతాయి. గతేడాది కంటే ఈ ఏడాది వర్షపాతం దారుణంగా పడిపోయిన కారణంగా సాగు ముందుకు కదలడం లేదు. 2021 ఆగస్టు 31 నాటికి మండలంలో 255.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా గతేడాది 183.8 మిల్లీమీటర్లు నమోదైంది. ఈ ఏడాది అదే సమయానికి 84.6 మిల్లీ మీటర్లే నమోదైంది. దీంతో వర్షాధార పొలాల్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. దీంతో వ్యవసాయ కూలీలకూ పనుల్లేక ప్రత్యామ్నాయ మార్గాలను వెదుక్కుంటున్నారు.
ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు ప్రత్యామ్నా పంటల సాగుకు ప్రయత్నిస్తున్నారు. నీటి అవసరం తక్కువగా ఉండే ఆరుతడి పంటలైన సోయాబీన్, అముదాలు, కంది తదితర పంటలు సాగు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. గతేడాది పోలూరులో నాలుగైదు ఎకరాల్లో ఈ పంట సాగు చేయగా ఈ ఏడాది సాగు రెట్టింపైంది. రాజాపేట, గొట్టిపాడులోనూ కొంతమంది రైతులు సోయాబీన్ సాగుకు సిద్ధమవగా మండలం మొత్తంలో 50 ఎకరాలోల అయినా సాగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సోయాబీన్ సాగుకు నీటి తడులు పెద్దగా అవసరం ఉండదు. రెండు మూడుసార్లు పెడితే సరిపోతుంది. ఈ పైరుకు తెగుళ్ల బెడతా పెద్దగా ఉండదని, పెట్టుబడి ఖర్చులూ తక్కువే. ఎకరాకు 25-30 కిలోల విత్తనాలు సరిపోతాయి. కిలో విత్తనాల ధర రూ.110-125 వరకూ ఉంటుంది. మూడు నెలల్లో పంట చేతికొస్తుంది. ఎకరాకు 10-12 క్వింటాళ్ల దిగుబడి ఉంటుంది. క్వింటాళ్ ధర రూ.9-11 వేల వరకూ దక్కే అవకాశం ఉంది. ఈ పంట పూర్తయిన వెంటనే రెండో పంటగా అదే పంట సాగు చేయొచ్చు లేదా వేరే పంట వేసుకోవచ్చు. పంట పూర్తయ్యాక ఆ వ్యర్థాలు పొలానికి ఎరువుగానూ ఉపయోగపడతాయి.
దీంతోపాటు మూణ్ణెల్లలో చేతికొచ్చే ఆముదాల పంట కూడా రైతులకు మంచి ఆదాయం ఇస్తుంది. రెండున్నర కిలోలతో ఎకరా సాగు చేయొచ్చని, కిలో విత్తనాలు రూ.450 వరకూ ఉంటాయని, రెండుసార్లు పురుగుల మందు పిచికారీ చేస్తే సరిపోతుందని, ఎకరాలకు 10 క్వింటాళ్ల దిగుబడి ఉంటుంది. అయితే వీటిపై రైతులకు అవగాహన కల్పించడం, వారిని సాగుకు సమాయత్తం చేయడంలో యంత్రాంగం అంతగా శ్రద్ధ పెట్టడం లేదు. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించాలని, విత్తనాలను ఉచితంగా అందించి రైతులను సాగుకు ప్రోత్సహించాలని రైతు నాయకులు కోరుతున్నారు.










