ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి తుని వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలో మెట్ట మండలాలైన తుని, రౌతులపూడి, కోటనందూరు, శంఖవరం, తొండంగి మండలాల్లో 37 వేల ఎకరాల్లో వరి సాగు జరగాల్సి ఉండగా 20 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. రౌతులపూడి మండలంలో 5,200 ఎకరాల సాధారణ విస్తీర్ణంలో ప్రతి సంవత్సరం వరి సాగవుతుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు వలన ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 1800 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు.
గండేపల్లి మండలం మొత్తం 12 వేల ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేస్తున్నారు. దీనిలో 8035 ఎకరాల్లో వరి వేయగా వర్షాలు లేక, సాగునీరు సక్రమంగా అందక వరి పొలం బీటలు వారుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే మండలం యల్లమిల్లిలో 1032 ఎకరాల్లో వర్షాధారంతో రైతులు అపరాలు సాగు చేస్తుంటారు. ఈసారి పరిస్థితులు భిన్నంగా మారడంతో 600 ఎకరాల్లో మాత్రమే అపరాలు వేశారు. ఇలా ఎన్నడూ లేనంతగా వాతావరణ మార్పులు కారణంగా అనేకమంది రైతులు ఆపదలో చిక్కుకున్నారు. రూ వేలల్లో అప్పులు చేసి పెట్టిన పెట్టుబడులు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాకినాడ జిల్లాలో ఈ ఏడాది 2.30 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యంగా అధికారులు నిర్ధేశించారు. అయితే ఇప్పటి వరకూ దాదాపు 2 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయని వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలు చెబుతున్నారు. అయితే వాస్తవంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు వలన కాలువల ద్వారా సాగునీరు సక్రమంగా అందని కారణంగా పలు మెట్ట ప్రాంతాల్లో నేటికీ నాట్లు పడని విస్తీర్ణం వేల ఎకరాల్లో ఉంది. దీంతో వేలాది మంది రైతులు రూ.వేలల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయి. కాలువలు ఆధునికరణ సక్రమంగా జరగకపోవడంతోనే సాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆందోళనలో రైతులు
ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేల ఎకరాల్లో నాట్లు పడలేదు. వేసిన పంటకు సాగునీరు సక్రమంగా అందక భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. ఉదాహరణకు రౌతులపూడి మండలం రాఘవపట్నం, గిడజం, రాజవరం, గంగవరం గ్రామాల్లో వర్షాలు లేక ఒక్క ఎకరంలో కూడా నాట్లు వేయలేదని రైతులు తెలిపారు. వ్యవసాయమే ఆధారంగా కుటుంబాలను పొషించుకుంటున్న తాము ఎలా బ్రతకాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నామని చెబుతున్నారు. ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల దష్ట్యా పంట వేయలేకపోయామని ఇదే మండలంలో దిగువసివాడ గ్రామానికి చెందిన కోరుప్రోలు సత్యనారాయణ (3 ఎకరాలు), అంకంరెడ్డి చంద్రర్రావు (2 ఎకరాలు), ఏ.రాజబాబు (ఎకర్నార), అప్పలరాజు (2 ఎకరాలు) రైతులు తెలిపారు. వచ్చేనెల మొదటి వారంలోగా మిగిలిన ఆయకట్టులో నాట్లు గనుక పడకపోతే రౌతులపూడిని కరువు మండలంగా భావించి 80 శాతం రాయితీపై అపరాల విత్తనాలను సరఫరా చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.గండేపల్లి మండల పరిధిలోని మల్లేపల్లి, సింగరాయపాలెం, రామయ్యపాలెం,ఉప్పలపాడు తదితర గ్రామాల్లో పుష్కర కాలువ తాళ్లూరు లిఫ్టు పనిచేయకపోవడంతో సుమారు 32 వేల ఎకరాల్లో వర్షాధారంతో సాగు చేస్తున్న వరి ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లోటు వర్షపాతం
కాకినాడ జిల్లాలో 21 మండలాలుండగా గత పదేళ్లలో ఎప్పుడూ లేనంత లోటు వర్షపాతం నమోదయిందని అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా సరాసరి జూన్ నెలలో 112.8 సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 60.1 మాత్రమే నమోదు అయింది. ఈ నెలలో 46.7 లోటు వర్షపాతం నమోదయింది. ఆగస్టులో 61.1శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది. శంఖవరం, తొండంగి, రౌతులపూడి, కాకినాడ రూరల్, తాళ్లరేవు, పిఠాపురం, జగ్గంపేట, సామర్లకోట, కిర్లంపూడి తదితర మండలాల్లో 60 నుంచి 76 శాతం లోటు వర్షపాతం నమోదైంది.










