కాలువలు లేక రోడ్లపైనే వర్షపు నీరు
అధికాదాయం ఉన్న వేములవలస
పంచాయతీలో ప్రజల అవస్థలు
పట్టించుకోని అధికారులు, నేతలు
ప్రజాశక్తి -ఆనందపురం: వేములవలస గ్రామంలో చిన్నపాటి వర్షాలకు గ్రామం మొత్తం జలమయమై రోడ్లు శిథిలానికి గురవుతున్నాయి. ఇటీవల వేములవలస వెల్లంకి సర్వీసు రోడ్డు పనులు చేపట్టారు. రోడ్డు వెడల్పు చేసినా, వర్షం కురిసినప్పుడు నీరు మళ్లిపోయేందుకు కాలువలు ఏర్పాటు చేయకపోవడంతో చినుకు రాలితే చాలు రోడ్డంతా జలమయమై, కోతకు గురౌతోందని స్థానికులు వాపోతున్నారు. అనందపురం పూల మార్కెట్ నుండి వేములవలస గ్రామం లోతట్టు ప్రాంతం కావడంతో పూల మార్కెట్ నుండి వస్తున్న నీరు రోడ్డు వెంబడి సరాసరి గ్రామంలోనికి వెళ్తోందని, దీంతో చిన్నపాటి వర్షాలకైనా గ్రామంలోని ఇళ్లల్లోకి నీరు చేరుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా ఇదే సమస్యతో రోడ్డు శిథిలమైతే, తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రోడ్డును బాగుచేస్తున్నారే తప్ప, సమస్యకు కారణమైన నీరు మళ్లింపునకు కాలువలు ఏర్పాటుపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పంచాయతీకి ఆదాయం ఉన్నా అభివృద్ధి శూన్యం
వేములవలస పంచాయతీకి ఏటా మార్కెట్ వేలం ద్వారా రూ.కోటి పైనే ఆదాయం సమకూరుతున్నా, దానికి అనుగుణంగా అభివృద్ధి చేపట్టడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ముఖ్యంగా వర్షపు నీరును పోవడానికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక, రహదారులు కోతకు గురి కావడంతో పాటు, గ్రామమంతా నీటితో నిండి చిత్తడిమారుతున్నా స్పందించడం లేదని మండిపడుతున్నారు. ఈ పంచాయతీలో నియోజకవర్గాన్ని శాసించే నాయకులు ఉన్నా, వారు పంచాయతీ అభివృద్ధిపైగానీ, ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదనే విమర్శలు బాహటంగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు, నేతలు స్పందించి, గ్రామంలో రోడ్డు పాడవ్వడానికి కారణమైన సమస్యపై దృష్టి పెట్టాలని, రోడ్డు పక్కన కాలువలు నిర్మించాలని కోరుతున్నారు.










