Sep 14,2023 00:49

ప్రజాశక్తి - బాపట్ల
కొద్దిపాటి వర్షానికే బాపట్ల పాత బస్టాండ్ చెరువుగా మారుతోంది. పట్టణంలో జిబిసి రోడ్డు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఇటీవల పాత బస్టాండ్  రోడ్డును ఎత్తు పెంచకుండా గుంటగా ఉన్న రోడ్డునే తారుతో వేశారు. చిన్న పార్టీ వర్షం కురిసినా బస్టాండ్లో  కూర్చున్న ప్రయాణికులు బస్సె క్కాలంటే మోకాల్లోతు నీళ్లలో దిగి బస్సు ఎక్కాల్సి వస్తోంది. అయితే రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ప్రయాణికులు వేచి ఉండే బస్టాండ్ వద్ద రోడ్డు ఎత్తు పెంచకుండా గతంలో పల్లంగా ఉన్న కంకర  రోడ్డుపైనే తారు వేసి రోడ్డు పనులు పూర్తి చేశారు. ఈ రోడ్డుకు మూడూవైపుల రోడ్డు ఎత్తుగాఉంది. బస్సులు ఆగి ప్రయాణికులు దిగి, ఎక్కే చోటే  రోడ్డు ఎత్తు లేకపోవడంతో వర్షం కురిస్తే ప్రయాణికులపాట్లు అంతా ఇంత కాదు. పిల్లలు, వృద్ధులతో బస్సు ఎక్కే ప్రయాణికులకు పెద్ద ఇబ్బందిగా మారుతుంది. వర్షం  నీటిలో దిగి బస్టాండులో ఆగి ఉన్న గుంటూరు, విజయవాడ, రేపల్లె, నిజాంపట్నం, మచిలీపట్నం, కొత్తపాలెం వెళ్లాల్సిన బస్సులు ఎక్కాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా గతంలో పట్టణంలో రోడ్లు విస్తరణలో భాగంగా రైల్వే స్టేషన్, డిఎస్పీ ఆఫీస్ ఎదురు రోడ్డును విస్తరించారు. ఇంజనీర్ల అవగాహన లేని నిర్వాహకంతో రైల్వే స్టేషన్ ఎదురు వర్షం కురిస్తే రైల్వే స్టేషన్ రోడ్డు ఎదురు మోకాళ్ళ లోతు నీరు నిలబడే పరిస్థితి ఏర్పడింది. దీంతో రైల్వే ప్రయాణికు, పాదాచారులకు, వచ్చే పోయే వాహనాలకు తీవ్రమైన ఇబ్బందిగా ఉంది. గత రెండేళ్లుగా ఈ ప్రాంతంలో సమస్యను పట్టణ ప్రజలు ఎంఎల్‌ఎ కోన రఘుపతి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రత్యేకంగా రైల్వే స్టేషన్ వద్ద వర్షపు నీరు తొలగింపునకు శాశ్వత పరిష్కారానికి రెండు ప్రధాన రైల్వే ద్వారాల ఎదురు వేసిన రోడ్డును పగలగొట్టి రెండు ప్రధాన గేట్లు ఎదురు రెండు కల్వర్టులు నిర్మించారు. అదికాక రైల్వే స్టేషన్ ప్రహరీ వైపు ఫుట్ పాత్ అంచున సైడ్ కాలువ కొత్తగా తీయాల్సి వచ్చింది. ఇదంతా రోడ్డు వేసే సమయంలోనే ఇంజనీరింగ్ అధికారులు సరిచూసుకొని ఉంటే అదనంగా ఖర్చయ్యేది కాదని ప్రజలు అంటున్నారు. ఇంజనీర్ల అవగాహనలోపం ప్రజలకు శాపంగా మారింది. చేసిన పనులనే చేస్తూ నిధులు వృధా చేస్తున్నారు తప్ప ప్రజలకు సౌకర్యం కలగడంలేదు. బస్టాండుకు చుట్టూ రోడ్లు ఎత్తులేపి బస్సులు ఆగేచోట పల్లంగా వదిలేయడం ప్రజలకు సమస్యగా మారింది.