Oct 27,2023 19:58

వర్షాభావంతో ఎండిపోయిన వేరుశనగ పంట

ఎండిపోతున్న పంటలు రైతులను ఆవేదనకు గురి చేస్తున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతన్నకు కన్నీరు తెప్పిస్తున్నాయి. ఈ ఏడాది ఖరీఫ్‌ మొదలైనప్పటి నుంచి అరకొరగానే వానలు కురిశాయి. ఈ వర్షాలకే రైతులు వివిధ రకాల పంటలు సాగు చేశారు. అడపాదడపా కురిసిన వర్షంతో పంటలు ఒక దశ వరకు వచ్చాయి. ఆ తర్వాత వర్షం పూర్తిగా ముఖం చాటేశాడు. చేతికి వచ్చే దశలో ఉన్న పంటలను కాపాడుకోవడానికి రైతుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వేల రూపాయలు ఖర్చు చేసి ట్యాంకర్లతో నీరు పెట్టి పంటలను రక్షించుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.ప్రజాశక్తి-కలికిరి
వర్షాధారంగా సాగు చేసిన మెట్ట పంటలను వర్షం దెబ్బ తీసింది. సకాలంలో వానల్లేక వేసిన పంటలు చేతికి అందివస్తాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అరకొరగా వర్షాలు కురవడం, ఆ తర్వాత ఖరీఫ్‌ సీజన్లో వర్షాధారంగా మెట్ట భూముల్లో వేరుశనగ సాగు చేసిన రైతాంగానికి లోటు వర్షపాతం తీరని నష్టాన్ని మిగిల్చింది. అదునులో పదును వాన కురవక పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. మండల పరిధిలో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 250 నుంచి 300 హెక్టార్లు కాగా ఈ ఖరీఫ్‌లో సగానికి సగం మాత్రమే సాగింది. సాధారణ సాగులో 20 శాతం పంట మాత్రమే రైతులు సాగు చేయడానికి ఆశక్తి చూపడం లేదు. నాలుగైదు సంవత్సరాలుగా రైతులు వేరుశనగ పంట వేయడానికి నిరాశక్తి వ్యక్తం చేస్తున్నారు. వేసిన పంటలకు కూడా ఆరకొరా వర్షానికి ఎండుతూ పండిన పంట దిగుబడి పడిపోవడంతో పాటు వర్షం కురవక రైతులు ట్యాంకర్లతో నీటిని పిచికారి చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. సకాలంలో వర్షాలు కురువకపోవడంతో వంద రోజుల్లో నూర్పిడి చేయాల్సిన వేరుశనగ 140 రోజులు దాటినా చేతికి అందక పోవడం, ట్యాంకర్లతో నీటిని తోలి పంటను నూర్పిడి చేస్తున్నారు. ఇలా చేయడంతో ఎకరానికి నాలుగైదు వేలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర వర్షాభావంతో అరకొరక పండిన పంట నూర్పిడికి రైతులకు తిప్పలు తప్పడం లేదు. చేతికొచ్చిన పంటను సకాలంలో నూర్పిడి చేయడానికి పదును వాన కరువైంది. ఎండిపోతున్న వేరుశనగ మొక్కలను తీయడానికి రైతులు ట్యాంకర్లతో నీటిని పిచికారి చేస్తున్నారు ట్యాంకర్లతో నీటి తడి అందించడానికి ఎకరానికి 6 నుంచి 7 ట్యాంకర్లు నీరు అవసరమని రైతులు వాపోతున్నారు. అంతంత మాత్రంగా పండిన పంట నూర్పిడికి అదనంగా నాలుగైదు వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని, ట్యాంకర్లతో నీటిని పిచికారి చేయడంతో అంతర పంటలు దెబ్బతిని అతను ఆదాయం కూడా కోల్పోవాల్సి వస్తుందని, ఎకరాని ఐదు బస్తాలు లోపే దిగుబడి రావడంతో పెట్టుబడి ఖర్చులు కూడా చేతికి రావడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నష్టాలు పాలు అవుతున్నాం
వేరుశనగ పంట సాగు చేస్తుండటంతో అధికంగా నష్టాలు పాలవుతున్నాం. వర్షాలు సకాలంలో పడకపోవడంతో దిగుబడి భారీగా తగ్గింది. సకాలంలో వర్షాలు కురువకపోవడం వలన వేరుశనగ కాయలు నాణ్యత లోపించింది. కొనుగోలుదారుల ఆసక్తి చూడడం లేదు.
- ఎస్‌.కరుణాకర్‌, రైతు, గుట్టపాలెం, కలికిరి.
పంట సాగుకు ధైర్యం చాలడం లేదు
ఒకటిన్నర ఎకరా విస్తీర్ణంలో వేరుశనగ సాగుకు రూ.30 వేలు ఖర్చయింది. వర్షాలు లేక మొక్కుకు ఐదారు కాయలే కాస్తున్నాయి. ఎకరానికి ఐదు బస్తాలు దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. పంట నూర్పిడికి ట్యాంకర్లతో నీరు పిచికారి చేయాల్సి వస్తుంది. అదనంగా ఖర్చు వస్తోంది. ప్రభుత్వం ఆదుకోవాలి.
- సురేందర్‌రెడ్డి, రైతు, కలికిరి.