Oct 22,2023 21:20

సీతానగరంలో ఎండిపోతున్న వరి

ప్రజాశక్తి - కురుపాం/సీతానగరం : ఖరీఫ్‌ కనుమరుగవుతుంది. వర్షాలు పడాల్సిన సమయంలో ఎండలు మండిపోతున్నాయి. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో వ్యవసాయం పరిస్థితి అయోమయంగా మారింది. మండలమంతా ఎక్కువగా మెట్టు ప్రాంతం కావడంతో వర్షాధారమే పంటలకు ఆధారం. అధిక ఎండల వల్ల పంట పొలాలకు సకాలంలో వర్షాలు పడకపోవడంతో పొలాలకు తడులుపెట్టలేని పరిస్థితిలో పైరు ఎండిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తుఫానుల కారణంగా పడిన వర్షం తప్ప కాలానుగుణంగా సరైన వర్షాలు ఈ ఏడాది పడలేదనిరైతులు నిరాశ చెందుతున్నారు. వరి పైరు పొట్ట దశలో ఉండగా తగినంత నీరు లేక పోవడం వల్ల వరి కంకుల్లో తాలు గింజలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, సరైన ఎదుగుదల లేక దిగుబడి రావడం కష్టంగా ఉందని వాపోతున్నారు. రైతులు వేలకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఎరువులు, పురుగు మందులు వాడి పంట చేతికి వచ్చే సమయంలో సరైన దిగుబడి రాక, తెచ్చిన అప్పులు తీర్చలేమని భయాందోళనకు గురవుతున్నారు. మండలంలో 10, 517 ఎకరాల్లో వరి పంట రైతులు సాగవుతోంది. మండలంలో ప్రధానంగా గెడ్డల ఆధారంగా పంటలు సాగవుతున్నాయి. ప్రస్తుతం ఇవి పూర్తిగా ఎండిపోవడంతో పంటలకు సాగునీరందడంలేదు. వీటిలో కిచ్చాడ, పూతికవలస, కురుపాం పరిధిలోని 816 ఎకరాల్లో బోరుబావు ఆధారంగా వరి సాగవుతుంది. మిగతా గిరిజన గ్రామాలన్నీ వర్షాధారం, గెడ్డలపై ఆధారపడే పంటలు సాగవుతున్నాయి. ప్రస్తుత వర్షాభావం నెలకొనడంతో పంటలన్నీ ఎండిపోతున్నాయి. దీంతో వేలాది రూపాయలు మదుపులు పెట్టిన రైతన్న దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించిన మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
సీతానగరం : పొట్టదశలో నీరందక వరి పంట పూర్తిగా ఎండిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట చేతికి వచ్చే సమయంలో వర్షాభావం వల్ల వరి పైరు ఎండిపోతుండడంతో రైతు కంటితడి పెడుతున్నాడు. మండలంలో ఈ ఖరీఫ్‌ సీజన్లో 15980 ఎకరాల్లో వరి సాగవుతుంది. అందులో 1200 ఎకరాలు ఎద కాగా, మిగిలినంది అంతా కాలువలు, వర్షాధారంపైనే ఆధారపడి సాగువుతుంది. వెంగళరాయ సాగర్‌ అదనపు జలాలపై ఆధారపడి 120 ఎకరాలు సాగవుతోంది. అక్కడి నుంచి నీరు సకాలంలో అందక కోటసీతారాంపురం, వెన్నెలబుచ్చెంపేట, గాదెలవలస, జానుముల్లువలస గ్రామాల్లో వరి పైరు పూర్తిగా ఎండిపోయింది. ఈ గ్రామాల సమీప చెరువుల్లో ఉన్న నీటిని మోటార్లు పెట్టి తోడించడంతో చెరువులు కూడా అడుగంటిపోయాయి. జంఝావతి ఎగువ కాలువ నుంచి 3వేల ఎకరాల వరకు సాగునీరు అందాల్సి ఉన్నప్పటికీ నీరు రాకపోవడంతో ఇప్పటికే అప్పయ్యపేట, నిడగల్లు, పాపంవలస, ఇప్పలవలస గ్రామాల్లో వందలాది ఎకరాలు వరి ఎండిపోతుంది. సీతానగరం ఆయకట్టు పరిధిలో కాజీపేట రెవెన్యూలో పొలాలు బీట్లు పడుతున్నాయి. ఇటీవల వ్యవసాయ అధికారి అవినాష్‌, తహశీల్దార్‌ ఎంవి రమణ ఆధ్వర్యంలో మండలంలో ఆరు గ్రామాల్లో తిరిగి 65 ఎకరాల వరి దెబ్బతిన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. 340 ఎకరాల్లో తేమశాతం తక్కువ ఉందని వాతావరణ ఇలా ఉంటే వారం రోజుల్లో మరో 150 ఎకరాలలో వరి ఎండిపోయే ప్రమాదం ఉందని అంచనా వేశారు. ఏది ఏమైనా సకాలంలో వర్షాల్లేక, అందుబాటులో ఉన్న సాగునీటి వనరులకు పాలకులు అందించకపోవడంతో రైతులు నష్టపోతున్నారు.
పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు
ఈ సంవత్సరం మూడెకరాల్లో వరి సాగు చేశాను. ఇప్పటి వరకు ఎరువులు, ఇతర పనుల నిమిత్తం రూ.60 వేల వరకు ఖర్చు పెట్టా. వర్షాలు కురవపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయి ప్రతిసారి నష్టాలకు గురవుతున్నా ఈసారి పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి. అప్పులు తీరే పరిస్థితి కనిపించడం లేదు.
ఆరిక దాసు ,
గిరిజన రైతు, పెద్ద గొత్తిలి, కురుపాం మండలం.

కరువు మండలంగా ప్రకటించాలి
మండలంలో ఎక్కువ మంది గిరిజన రైతులే. వీరంతా వర్షాలపైనే ఆధారపడి వరి సాగు చేస్తున్నారు. అయితే వరిసాగుకు ఇంతవరకు పెట్టుబడులు పెట్టిన రైతులు అప్పుల పాలయ్యారు. ప్రస్తుతం పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. కావున ప్రభుత్వం స్పందించి కరువు మండలంగా ప్రకటించి గిరిజన రైతులను ఆదుకోవాలి.
ఎం. శ్రీనివాసరావు,
గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి.