చిన్నశేషునిపై మలయప్ప
ప్రశాంతంగా ముగిసిన సిఎం పర్యటన
ప్రజాశక్తి -తిరుపతి బ్యూరో
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తరపున శ్రీవారి పట్టు వస్త్రాలను సమర్పించారు. రాత్రి తిరుమలలోనే బస చేశారు. మంగళవారం ఉదయం మరోసారి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు మంగళవాయిద్యాల నడుమ ఆలయ అర్చకులు ఇఫ్తికాఫల్ స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ముఖ్యమంత్రి వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని, ముఖ్యమంత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్‌కె రోజా, ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
సాలకట్ల బ్రహ్మౌత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ద్వారక కష్ణుడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ
శ్రీవారి సాలకట్ల బ్రహ్మౌత్సవాలలో తొలిరోజైన సోమవారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎవి.ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ఆ తరువాత ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, శ్రీ వేంకటేశ్వర స్వామివారి కళంకారీ చిత్రపటాన్ని అందజేశారు.
శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ ప్రారంభం
తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద తిరుపతిలో రికార్డు సమయంలో నిర్మించిన శ్రీనివాససేతు ఫ్లైఓవర్‌ను సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.తిరుపతి మామిడికాయల మండీ వద్ద జరిగిన శ్రీనివాస సేతు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రివర్యులు మాట్లాడుతూ రూ.650.50 కోట్లతో 7 కిలోమీటర్ల మేర నిర్మించిన ఫ్లై ఓవర్ తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి ఆభరణం లాంటిదన్నారు. ఇది ఇంజినీరింగ్ అద్భుతమని, దీని వల్ల ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని, యాత్రికులు సులభంగా తిరుమలకు చేరుకోగలగుతారని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో 37.80 కోట్ల రూపాయలతో టీటీడీ నిర్మించిన రెండు హాస్టల్ బ్లాకులను వర్చువల్‌గా ప్రారంభించారు. హాస్టల్ బ్లాకుల్లో మొత్తం 181 గదులు ఉన్నాయి. ఇందులో 750 మంది విద్యార్థులు బస చేయవచ్చు.
టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల పంపిణీ
టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాల పంపిణీ సందర్భంగా ముఖ్యమంత్రివర్యులు మాట్లాడుతూ వడమాలపేట మండలం పాదిరేడు గ్రామ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం 300 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయించడం టీటీడీ చరిత్రలో ఒక మహత్తర ఘట్టమన్నారు. మొత్తం 6700 మంది టీటీడీ ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం రూ.313 కోట్ల వ్యయంతో 3,518 మందికి ఇంటిస్థల పట్టాలు పంపిణీ చేస్తున్నామని, రూ.280 కోట్ల వ్యయంతో మిగిలిన ఉద్యోగులకూ 30 నుండి 45 రోజుల వ్యవధిలో ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కొంతమంది ఉద్యోగులకు ఇంటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో గతంలో టిటిడి ఉద్యోగులకు ఇళ్లస్థలాలు మంజూరయ్యాయని, తిరిగి వారి కుమారుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హయాంలో ఇళ్లస్థలాలు మంజూరయ్యాయని తెలిపారు. తండ్రీ కొడుకుల హయాంలో టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా తాను పని చేయడం తన అదష్టమన్నారు. టీటీడీ ఉద్యోగుల దశాబ్దాల కలను సాకారం చేసినందుకు ముఖ్యమంత్రివర్యులకు కతజ్ఞతలు తెలిపారు.
గంగమ్మను దర్శించుకున్న సిఎం
ప్రాచీన సంప్రదాయాన్ని పాటిస్తూ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్‌రెడ్డి తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించారు. డెప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలం సురేష్, రోజా, కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి, ఎస్‌పి పరమేశ్వరరెడ్డి, తుడా ఛైర్మన్, టీటీడీ బోర్డు సభ్యులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డెప్యూటీ మేయర్ భూమన అభినరు రెడ్డి పాల్గొన్నారు.
ముఖ్యమంత్రికి సాదర వీడ్కోలు
రెండు రోజులు తిరుపతి, తిరుమలలో పలు కార్యక్రమాల్లో పాల్గొని మంగళవారం ఉదయం 9.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి సాదర వీడ్కోలు లభించింది










