ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్ : పట్టణంలో గురువారం మధ్యాహ్నం కురిసిన చిన్నపాటి వర్షానికి ప్రధానరహదారి చెరువులా తయారైంది. బెలగాం ఆర్‌టిసి కూడలిలో వాణిజ్య సముదాయాల వద్ద ఉన్న ప్రధాన కాలువలో పూడికలు పేరుకుపోయాయి. అదే కాలువ ద్వారా ప్రవహించే మురుగునీటితో పాటు వర్షపు నీరు ప్రధాన రహదారిపైకి పొంగి ప్రవహించింది. దీంతో పాదచారులతోపాటు, వాహన చోదకులు నానా అవస్థలు పడ్డారు. మున్సిపల్ సాధారణ నిధులతో 10 లక్షల రూపాయలతో 30 వార్డుల్లో ఉన్న మురుగు కాలువలలో పూడికతీతలు తీశారు. కానీ, బెలగాం గెడ్డవీధి నుండి రాయగడ రోడ్డు శివారు వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న కాలువల్లో పూడికలు తొలగించలేదు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత జటిలమవుతుందని పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.










