ప్రజాశక్తి - ఆస్పరి
మండలంలోని చిన్నహోతూరు గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు హనుమంతు, మండల సీనియర్ నాయుకులు రామాంజినేయులు డిమాండ్ చేశారు. శుక్రవారం సచివాలయం ముందు ధర్నా చేపట్టారు. ఇంజినీర్ అసిస్టెంట్ మల్లికార్జునకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బాపురం రిజర్వాయర్ నుంచి సక్రమంగా నీరు పంపింగ్ చేయక పోవడం వల్ల వారానికోసారి తాగునీరు వస్తోందని తెలిపారు. ఫిల్టర్ నీరు కొని తాగే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇంటింటికీ కుళాయి వేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ప్రగల్బాలు చెప్పడం తప్ప ఆచరణలో లేదని విమర్శించారు. సచివాలయ అధికారులు సమయానికి విధులకు హాజరు కాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సక్రమంగా విధులకు హాజరు కాని సచివాలయ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో రోడ్లు, డ్రెయినేజీ పనులు చేపట్టాలని, పశువుల ఆస్పత్రి భవనానికి మరమ్మతులు చేపట్టాలని కోరారు. చెడి పోయిన చేతి పంపులను వెంటనే బాగు చేయించాలన్నారు. సిపిఎం గ్రామ నాయకులు గర్జన్న, నరసప్ప, జయరాజు పాల్గొన్నారు.
వినతిపత్రం అందజేస్తున్న నాయకులు










