Sep 04,2023 00:18

గ్రామంలో ఉన్న చిన్నారులు, గర్భిణులు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: మండలంలోని సాగర పంచాయితీ బలియగూడ పిటిజి గ్రామంలో అంగన్వాడి కేంద్రం లేక ఆ గ్రామ ఐదేళ్ల లోపు చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామంలో సుమారు 55 పీటిసి కుటుంబాలు ఉన్నాయి. అందులో ఐదేళ్ల లోపు చిన్నారులు సుమారు 40 మంది ఉన్నారు. వీరితో పాటు బాలింతలు, గర్భిణీ మహిళలు కూడా ఉన్నారు. అక్కడ అంగన్వాడి కేంద్రం లేకపోవడంతో సుమారు కిలోమీటర్‌ దూరంలో ఉన్న సాగర అంగన్వాడి కేంద్రం నుంచి ప్రతి నెల పౌష్టికాహారాన్ని ఆ గ్రామస్తులు తీసుకుంటున్నారు. గతంలో కోన్నాళ్లు పాటు ఆ గ్రామానికి చెందిన ఓ మహిళ సాగర నుంచి పౌష్టికాహారాన్ని బలియగూడ, తరలించి చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు పంపిణీ చేసేది. అయితే ఆమెకు ఎటువంటి వేతనం చెల్లించక పోవడంతో ఆమె పౌష్టికాహారాన్ని పంపిణి చేయడం మానేసింది. దీంతో, ఆ గ్రామస్తులు కిలోమీటర్‌ దూరం నడుచుకొని వెళ్లి సాగర అంగన్వాడి కేంద్రం నుంచి ప్రతిరోజు పౌష్టికాహారాన్ని తీసుకుంటున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులు సుమారు 40 మంది ఉన్నా అంగన్వాడి కేంద్రం మంజూరు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా పిటిజి గిరి చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏజెన్సీ ప్రాంతంలో రక్తహీనత వ్యాధి నివారించడానికి ప్రభుత్వం ప్రతి అంగన్వాడి కేంద్రం ద్వారా గిరి చిన్నారులు, బాలింతలు ,గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందిస్తుంది. అంగన్వాడి కేంద్రం మంజూరు చేయడంలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో నిరుపేద చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందని పరిస్థితి నెలకొంటుందని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు గత ఐదేళ్ల క్రితం ఆ గ్రామంలో ఒకే ఇంట్లో నుంచి ముగ్గురు చిన్నారులు మృతి చెందగా ఆ గ్రామంలో ఉన్నత స్థాయి అధికారులు పర్యటించి వెంటనే అక్కడ అంగన్వాడి కేంద్రం మంజూరు చేయాలని అప్పట్లో అదేశాలు జారీ చేశారు. అయిన ఇప్పటికీ స్థానిక ఐసిడిఎస్‌ అధికారులు అంగన్వాడి కేంద్రం మంజూరుకు చర్యలు చేపట్టకపోవడం విచారకరం. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి బలియాగూడ గ్రామంలో నూతన అంగన్వాడి కేంద్రాన్ని మంజూరు చేసి పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు.
బలియాగుడ పిటిజి గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని మంజూరు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి.సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. గ్రామంలో సందర్శించి ఆ గ్రామస్తులతో సమస్యలు అడిగి తెలుసుకున్న ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆరేళ్ల లోపు చిన్నారులు సుమారు 40 మంది ఉన్నారన్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు ఆ గ్రామస్తులు విన్నవించుకున్నా నూతన అంగన్వాడి కేంద్రం మంజూరు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన చెందుతు న్నారన్నారు. తక్షణమే అంగన్వాడి కేంద్రాన్ని మంజూరు చేయాలని లేని పక్షంలో ఆందోళన చేపడుతామని ఆయన హెచ్చరించారు.