ప్రజాశక్తి - ఆదోని
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలని ఫుడ్ కమిషన్ ఛైర్మన్ ప్రతాప్‌రెడ్డి సూచించారు. బుధవారం ఆదోనిలోని బండిమెట్ట వీధిలో సెంటర్ నెంబర్-88ని సందర్శించి అక్కడ రికార్డులను తనిఖీ చేశారు. నిల్వ ఉన్న స్టాకు, రికార్డుల్లో పొందుపరిచిన స్టాక్ వివరాలకు పొంతన లేకపోవడంతో నిలదీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రక్తహీనతను పారదోలేందుకు ప్రభుత్వం రాగి, గోధుమ పిండి, గుడ్లు, ఇతర సరుకులు ఇస్తోందని తెలిపారు. వాటిని పంపిణీ చేయడంలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ప్రభుత్వ ఆశయానికి సహకరించాలని కోరారు. స్టాక్ వివరాలు పొంతన లేకపోవడంతో అంగన్వాడీ టీచర్ అనితకు మెమో ఇవ్వాలని సిడిపిఒ ఉమామహేశ్వరికి ఫోన్‌లో సూచించారు. అనంతరం ప్రజాపంపిణీ చేసే వాహనాన్ని పరిశీలించి అక్కడ సరుకులు ఎలా ఇస్తున్నారని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సిఎస్‌డిటి వలీ, సూపర్‌వైజర్ రాగిణి, వసంత ఉన్నారు. ఆస్పరి కస్తూరిబా గాంధీ బాలిక పాఠశాలను ఎపి ఫుడ్ కమిషన్ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి రుచి చూశారు. భోజనాలు ఎలా ఉన్నాయని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని బిణిగేరి గ్రామంలో రేషన్‌షాపు-4ను పరిశీలించి రిజిస్టర్‌ను చెక్ చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పత్తికొండ సివిల్ సప్లయి పాయింట్ నుంచి రేషన్ షాపులకు ఇస్తున్న 50 కిలోల బియ్యం బస్తాల్లో కిలో నుంచి రెండు కిలోల వరకు బియ్యం తక్కువగా వస్తున్నాయని డీలర్ సరస్వతి ఫుడ్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. పక్కనే ఉన్న సివిల్ సప్లయి డిపో మేనేజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రం-4 రికార్డులను తనిఖీ చేసి అంగన్వాడీ టీచర్ రాణితో మాట్లాడారు. చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం ఇస్తున్నారా లేదా అంటూ లబ్ధిదారులకు ఫోన్ చేసి విచారించారు. డిఇఒ రంగారెడ్డి, పత్తికొండ ఆర్‌డిఒ మోహన్ దాస్, తహశీల్దార్ కుమారస్వామి, పిఒ వేణుగోపాల్, జిసిడిఒ సునీత, సిడిపిఒ నిర్మలాదేవి, సూపర్‌వైజర్లు సునీత, పద్మావతి, విఆర్‌ఒ గోవిందులు పాల్గొన్నారు.










