ప్రజాశక్తి-పిట్టలవానిపాలెం: పిట్టలవానిపాలెం మండల కేంద్రంలో గల శాఖా గ్రంథాలయంలో గత నెల మే 8వ తేదీ నుంచి నిర్వహిస్తున్న వేసవి శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారని గ్రంథాలయ అధికారి మోర్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులకు కథలు చెప్పటం, లెమన్ స్పూన్, క్విజ్, డ్రాయింగ్, మ్యూజికల్ చైర్స్, వ్యాసరచన, వక్తృత్వం మొదలగు పోటీలు నిర్వహించామని తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు గ్రంథాలయ అధికారి మోర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయంలో పూర్వం చదువుకొని ప్రస్తుతం హైదరాబాదులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న శ్రీమతి సూరే అనూష మాట్లాడుతూ తాను గ్రంథాలయం ఉపయోగించుకోవటం వలన ఎంతో ప్రయోజనం పొందినట్లు తెలిపారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మున్నం చిన్న సుబ్బారెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయం వల్ల ప్రయోజనాలను విద్యార్థులకు తెలియజేశారు. గ్రంథాలయ అధికారి మాట్లాడుతూ ఈ సమ్మర్ క్యాంపులో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు, సమ్మర్ క్యాంపునకు పంపిన తల్లిదండ్రులకు తన కృతజ్ఞతలు తెలుపుకున్నారు.










