ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : పోషకాహార పునరావాస కేంద్రం (ఎన్‌ఆర్‌సి)ను జిల్లా ఆసుపత్రిలో ఆదివారం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డిఐఒ) డాక్టర్ టి.జగన్మోహనరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి అక్కడ అడ్మిట్ అయిన ఐదేళ్లలోపు పిల్లల ఆరోగ్య వివరాల నమోదు రికార్డులు పరిశీలించారు. పది పడకల ఎన్‌ఆర్‌సిలో ప్రతి నెలా జరుగుతున్న అడ్మిషన్లు, డిశ్చార్జ్‌ల వివరాలు, చేరేతప్పుడు వారి బరువు, ఆరోగ్య స్థితి అదేలా డిశ్చార్జ్ అయ్యేనాటికి వారి బరువు ఆరోగ్య స్థితి ఏ మేరకు మెరుగైందీ పరిశీలించారు. వారికిస్తున్న పోషకాహార మెనూ పరిశీలించారు. ప్రతి బెడ్ వద్ద ఉన్న చిన్నారి ఆరోగ్య పరిశీలన చేసి వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. అందుతున్న వైద్య సేవలపై ఆయన అడిగి తెలుసుకున్నారు. అక్కడ పిల్లల బరువును స్వయంగా తనిఖీ చేశారు. ఈ పరిశీలనలో సూపర్‌వైజర్ జయగౌడ్, వైద్య సిబ్బంది ఆశాజ్యోతి, దివ్యతేజ ఉన్నారు.










