కొమరాడ: కొమరాడ మండలంలోని రెబ్బ గ్రామానికి చెందిన కోలక సోమయ్య, చంద్రమ్మ దంపతుల కుమార్తె మరియమ్మ(7)కు కూనేరు రామభద్రపురం పిహెచ్‌సి వైద్యాధికారి శామ్యాన్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించారు. మూడో తరగతి చదువుతున్న మరియమ్మ జ్వరం బారిన పడడంతో శుక్రవారం నాగావళి నదిలో వెదురుబొంగుల తెప్పపై ప్రమాదకరంగా ప్రయాణం చేసి చికిత్స కోసం అష్టకష్టాలు పడిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో వైద్య సిబ్బంది స్పందించి కూనేరు రామభద్రపురం ఆస్పత్రికి తీసుకురావాలని సోమయ్యకు సూచించడంతో శనివారం ఆయన సిబ్బంది సహాయంతో మళ్లీ వెదురు బొంగుల తెప్పపైఏనా ఆస్పత్రికి తీసుకొచ్చాడు. చిన్నారికి వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. అనంతరం మెరుగైన వైద్య సేవలు కోసం పార్వతీపురం మన్యం జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు వైద్య అధికారులు తెలిపారు.
గిరిజనుల ప్రాణాలతో చెలగాటం దారుణం.. సిపిఎం
పాలకులు, అధికారులు గిరిజనుల ప్రాణాలతో చెలగాటం ఆడడం చాలా దారుణమని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి అన్నారు. శుక్రవారం రెబ్బ గ్రామానికి చెందిన మరియమ్మ వైద్య సేవలు కోసం నదిలో ప్రాణాలకు తెగించి ప్రమాదకర ప్రయాణాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మండలంలో దీర్ఘకాల సమస్యగా ఉన్న పూర్ణపాడు లాబేసు వంతెన నిర్మాణం పూర్తయితే గిరిజనులు పడుతున్న ఇబ్బందులు తప్పుతాయన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం పాలకుల సొంత స్వలాభం కోసం వంతెన నిర్మాణం మధ్యలో నిలిపివేయడం దుర్మార్గమన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం వంతెన పనులు ప్రారంభించకపోవడం చూస్తే గిరిజన పట్ల ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో అర్ధమవుతుందన్నారు. గిరిజనులు పడుతున్న అష్ట కష్టాలను చూసి కనీసం స్పందించే పరిస్థితి కూడా కనిపించకపోవడం చాలా దారుణమన్నారు. నియోజవర్గంలో ఎమ్మెల్యే నుంచి ఉపముఖ్యమంత్రి స్థాయి వరకు పదవులు పొందినా కనీసం వంతెన నిర్మించకపోవడం దారుణమన్నారు. 1996లో నాటు పడవ మునిగిపోయి 36 మంది ప్రాణాలు పోయినా ఇప్పటికీ కనీసం వంతెన నిర్మించేందుకు ప్రభుత్వ చర్యలు చేపట్టకపోవడం అన్యాయమన్నారు. తక్షణమే గిరిజనులకు ఎంతో అవసరమైన నాగావళి నదిపై వంతెన నిర్మాణం పూర్తి చేసి గిరిజనుల ఇబ్బందులను తొలగించాలన్నారు. వంతెన నిర్మాణం కోసం ఎప్పటికి దశలవారీగా అనేక మార్లు నిరసనలు ధర్నాలు చేశామని భవిష్యత్తులో కూడా అవసరమైతే పోరాటాలు ఉధతం చేస్తామని తెలిపారు.










