ప్రజాశక్తి - భీమడోలు
సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి చిన్నారి మృతిచెందిన ఘటన అర్జావారిగూడెంలో చోటుచేసుకుంది. భీమడోలు ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక గ్రామపంచాయతీ పరిధిలోని అర్జావారిగూడెం ఆవాస ప్రాంతానికి చెందిన అంగులూరి వినోద్ కుమార్ కుమార్తె నాలుగు సంవత్సరాల వయసు గల చిన్నారిని చికిత్స కోసం సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. అక్కడ వైద్యులు వివిధ పరీక్షలను నిర్వహించి వ్యాధి నిర్థారణ కోసం సామాజిక ఆరోగ్య కేంద్రంలో అబ్‌జర్వేషన్‌లో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం ఏడు గంటల సమయంలో చిన్నారి మృతి చెందింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న బాలిక బంధువులు చిన్నారి మృతికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమేనని, చికిత్సకు సకాలంలో స్పందించలేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న భీమడోలు సిఐ, ఎస్‌ఐ వివాదాన్ని సర్దుబాటు చేసేందుకు కృషి చేశారు. చిన్నారి మృతి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురువారం ఏలూరు తరలించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ చిన్నారిని కాపాడేందుకు తాము చేసిన కృషిలో లోపాలు లేవని తెలిపారు.










