Sep 29,2023 22:22

బాలిక హత్య కేసులో నిందితుడు అరెస్టు
ప్రజాశక్తి - భీమవరం రూరల్‌

             చిన్నాన్నే బాలికపై దారుణంగా అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేశాడని ఎస్‌పి రవిప్రకాష్‌ తెలిపారు. ఈ నెల 26వ తేదీన అదృశ్యమైన బాలిక హత్య కేసు వివరాలను భీమవరం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించిన వెల్లడించారు. స్థానిక ఏడో వార్డులో లెపర్సీ కాలనీలో నివాసం ఉంటున్న ములుకు అంజి, దుర్గ దంపతులకు ఒక కుమార్తె ఉంది. స్థానిక లూథరన్‌ హైస్కూలులో ఏడో తరగతి చదువుతుంది. బాలిక తల్లిదండ్రులు ఈ నెల 26 తేదీన ఉపాధి నిమిత్తం కూలి పనికి వెళ్లారు. ఇంటికి వచ్చేసరికి కుమార్తె కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఎక్కడా ఆచూకీ లభ్యం కాలేదు. 27వ తేదీన వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 28వ తేదీప వారు నివాసం ఉంటున్న ఇంటి వెనుక వైపు జమ్ము తుప్పల్లో బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో బాలిక తల్లి దుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏలూరు రేంజ్‌ డిఐజి అశోక్‌కుమార్‌, ఎస్‌పి రవిప్రకాష్‌, డిఎస్‌పి మురళీకృష్ణ, భీమవరం డిఎస్‌పి శ్రీనాథ్‌, సిఐ శ్రీనివాస్‌ దర్యాప్తును కొనసాగించారు. దర్యాప్తులో బాలికకు వరసకు చిన్నాన్న అయిన ములుకు శివ బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేసి ఇంటి వెనుక ఉన్న పొదల్లో పడేసినట్లు తేలింది. బాలిక తల్లిదండ్రులు పోలీసుల వద్దకు వెళ్లారని తెలుసుకొని శివ భీమవరం డిప్యూటీ తహశీల్దార్‌ గ్రంధి పవన్‌కుమార్‌ వద్ద లొంగిపోయాడని తెలిపారు. దీంతో శుక్రవారం అతడిని అరెస్ట్‌ చేశారు. డిజిపి ఆదేశాలతో త్వరలో ఛార్జ్‌షీట్‌ వేస్తామని తెలిపారు.