Nov 26,2022 23:46

మాట్లాడుతున్న చిన్నయ్యపడాల్‌

ప్రజాశక్తి-పాడేరు: గిరిజనుల జీవనాధారమైన అటవీ వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా చిన్న తరహా కుటీర పరిశ్రమలను నెలకొల్పాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్య పడాల్‌ ప్రభుత్వానికి సూచించారు. పరిశ్రమల ఏర్పాటుతోనే జిల్లా అభివృద్ధి సాధ్య మౌతుందన్నారు. సిఐటియు చింతపల్లి 5వ మండల మహాసభ స్థానిక గిరిజన భవన్లో పెంటమ్మ లక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నయ్య పడాల్‌ మాట్లాడుతూ, అల్లూరి జిల్లాలో పండే పంటలతోనే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అరుకు, పాడేరు, చింతపల్లి కేంద్రాలలో ఈ పరిశ్రమలు నెలకొల్పితే వందలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కాఫీ, మొక్కజొన్న, పసుపు వంటి పంటలకు పొడి ప్యాకింగ్‌ చేసి ఎగుమతి చేయవచ్చని అన్నారు. అటవీ ఫల సాయాలు అడ్డాకులు, చింతపండు వంటి పరిశ్రమలు కూడా పెట్టవచ్చని కోరారు. ప్రభుత్వ స్కీములలో పని చేస్తున్న కార్మికులందరికీ రూ.26 వేల కనీస వేతనం ఇచ్చేంత వరకు పోరాడుతూనే ఉండాలని పిలుపునిచ్చారు. అసంఘటితర కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు పద్మ, వేములపూడి రామకృష్ణ, కిలో సింహాచలం, సాగిన చిరంజీవి, మండలంలో వివిధ రంగాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.