Oct 08,2023 21:10

చిన్న శ్రీను చదరంగానికి బొత్స చెక్‌?

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : వైసిపి జిల్లా రాజకీయాలు విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లను తాకాయి. అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఉండగానే, విజయనగరం ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌కు నియోజకవర్గంలో అసమ్మతి గ్రూపు బుజ్జగింపుల బాధ్యతను అప్పజెప్పడం చర్చనీయాశంగా మారింది. ఎచ్చెర్ల రాజకీయ పరిణామాలు యాదృచ్ఛికంగా నడుస్తున్నాయా? లేక మంత్రి బొత్స సత్యనారాయణ తన వ్యూహానికి పదును పెట్టారా? అన్న చర్చ ముమ్మరంగా సాగుతోంది.
ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ పార్టీలో చాలా కాలంగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వైసిపి విజయనగరం జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) జోక్యం ఇటీవల ఎక్కువగానే కనిపించింది. దీంతో, అక్కడి ముఖ్య నాయకులంతా ప్రజా సమస్యలు, రాజకీయ అంశాలపై కొంతకాలంగా చిన్న శ్రీనుతోనే చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీను అభిమానులంతా ఆయన జన్మదినోత్సవం రోజు ఎక్కడికక్కడ భారీ ఫ్లెక్సీలు కట్టడం, వాటిని గుర్తు తెలియని వ్యక్తులు చించేయడం, ఈ పని ఎమ్మెల్యే కిరణ్‌ అనుకూల గ్రూపేనంటూ అనుమానించడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో చిన్న శ్రీను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎచ్చెర్ల నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం కూడా కాస్త ఎక్కువగానే సాగింది. అందువల్లే అక్కడ ఎమ్మెల్యే వ్యతిరేక గ్రూపునకు దగ్గరయ్యారని కూడా చాలా మంది విశ్లేషించారు. అందుకు తగ్గట్టే కిరణ్‌కుమార్‌ వ్యతిరేక గ్రూపు 'ఎమ్మెల్యే వద్దు... జగన్‌ ముద్దు' అంటూ ఒకానొక సందర్భంలో పెద్దపెట్టున నినాదాలు కూడా చేశారు. మొత్తం వ్యవహారాన్ని పసిగట్టిన మంత్రి బొత్స సత్యనారాయణ.. శ్రీకాకుళం జిల్లా ఇన్‌ఛార్జి హోదాలో ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో నినాదాలపై 'వాటీజ్‌ నాన్సెన్స్‌' అంటూ ఘాటుగానే స్పందించారు. ఆ తరువాత కొద్దిరోజులకే ఎచ్చెర్ల నియోజకవర్గంలో అసమ్మతి గ్రూపు బుజ్జగింపుల బాధ్యతలు బెల్లానకు అప్పగించారు. తాజాగా ఎమ్‌పి బెల్లాన.. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని కీలకమైన నాయకులను పిలిపించుకుని రాజకీయాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా వ్యతిరేక గ్రూపుతో అంతర్గత విషయాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్యే కిరణ్‌కుమార్‌పై చాలాకాలంగా గుర్రుగా ఉన్న ఆయన కుటుంబ సభ్యులు సయోధ్యకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఎన్నికలలోపు నియోజకవర్గంపై ఎమ్‌పి బెల్లాన పట్టుసాధిస్తే సీటు కేటాయింపు విషయంలో ఆలోచించవచ్చని మంత్రి బొత్స ఉన్నట్టుగా పలువురు విశ్లేషిస్తున్నారు.  అదే జరిగితే చిన్న శ్రీను సంగతి ఎలా ఉంటుందోనన్న చర్చ కూడా నడుస్తోంది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు గాను చీపురుపల్లి, గజపతినగరంలో ఇప్పటికే మంత్రి బొత్స, ఆయన సోదరుడు అప్పలనర్సయ్య పాగా వేశారు. నెల్లిమర్లలో చిన్న శ్రీను బావే సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు కూడా ఆశిస్తున్నారు. ఈ మూడు కాపు సామాజిక తరగతికి కేటాయిస్తే, శృంగవరపుకోట, బొబ్బిలి నియోజకవర్గాలు వెలమ సామాజిక తరగతికి కేటాయించే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. రాజాం ఎస్‌సి రిజర్వుర్డు నియోజకవర్గం. విజయనగరం నుంచి పోటీకి డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల ఉన్నారు. ఈ నేపథ్యంలో చిన్న శ్రీను పరిస్థితి ఎలా ఉంటుందో అన్న దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది.