ఐటిడిఎ పిఒ సూరజ్ గోనోరే
ప్రజాశక్తి - రంపచోడవరం
అర్హులైన యువతి యువకులు పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు సమర్పిస్తే చిన్న పరిశ్రమల శాఖ ద్వారా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గోనోరే పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏడు మండలాలకు సంబంధించిన బ్యాంకు మేనేజర్లు, ఎపియంలు, డిపియంలు, చిన్న పరిశ్రమలకు దరఖాస్తుల చేసుకున్న దరఖాస్తుదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిఒ సూరజ్ గనోరే మాట్లాడుతూ 8వ తరగతి ఆపై చదువుకున్న యువతి యువకులకు చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు పీఎంఈజీపి పథకం ద్వారా రుణాలు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తుదారులకు బ్యాంక్ సివిల్ స్కోర్‌ను బట్టి సబ్సిడీపై అర్హులైన వారికి రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఏజెన్సీలోని అన్ని గ్రామాలలో వివిధ రకాలైన వ్యాపారాలు చేసుకొనుటకు ఎవరైనా దరఖాస్తులు చేసుకుంటే రుణాలు మంజూరు చేయుటకు సంబంధిత బ్యాంకు మేనేజర్లతో సంప్రదించాలని సూచించారు. రుణం మంజూరైన తర్వాత వివిధ షాపుల్లో లోగో కూడా పెట్టాలన్నారు. జీఎస్టీ సర్టిఫికెట్ ఉన్న వారి దగ్గర నుండి మాత్రమే కొటేషన్లు తీసుకురావాలన్నారు. రెంటు షాపుల్లో వివిధ రకాలైన యూనిట్లు ఏర్పాటు చేసుకొనుటకు షాపు యజమాని దగ్గర నుండి అగ్రిమెంట్ పత్రాలు సమర్పించాలని సూచించారు. శిక్షణ పొందిన దరఖాస్తుదారులకు మాత్రమే సబ్సిడీ వర్తిస్తుందన్నారు. రుణాలు మంజూరు చేయుటకు బ్యాంకు మేనేజర్లకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్న పరిశ్రమల శాఖ ప్రాజెక్ట్ అధికారి సిహెచ్.శ్రీనివాసరావు, వెలుగు ఏపిడి ఎ.శ్రీనివాసరావు, లీడ్ బ్యాంకు మేనేజర్ రవితేజ, బ్యాంకు మేనేజర్ల ఎం.శ్రీనివాసరావు, రాజ్ కిషోర్, డిపియంలు పరమేశ్వరరావు, అపర్ణ, పియంఇజిపి యాంకర్ పర్సన్ రామరాజు, ఏపీఎంలు అప్పారావు, శ్యాం కుమార్, మధు, జేమ్స్, సూరమ్మ, రాజు, ఆదినారాయణ, దరఖాస్తుదారులు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.










