
ఇండిస్టియల్ నూతన పాలసీ చిన్న పరిశ్రమలకు చేయూతనివ్వడం సందేహాలకు తావిస్తోంది. పెట్టుబడి రాయితీ, జగనన్న బడుగు వికాసం స్కీముల కింద చిన్న, సూక్ష్మ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన మేరకు సబ్సిడీలను ప్రకటించింది. గత పాలసీ తరహాలోనే సబ్సిడీలు ఉన్నప్పటికీ వాస్తవంగా పరిశీలిస్తే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఐదేళ్లపాటు లభించే ఆర్థిక ప్రయోజనాలను కుదించినట్లు తెలుస్తోంది. యూనిట్ వ్యయానికి మించి లభించే ప్రయోజనాల్ని యూనిట్ వ్యయానికి సమానంగా చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారంలో నూతన పాలసీ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.ప్రజాశక్తి - కడప ప్రతినిధి
జిల్లాలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలపై ఇండిస్టియల్ నూతన పాలసీ చిన్న, సూక్ష్మ, పెట్టుబడి రాయితీ స్కీములపై గణనీయమైన ప్రభావం చూపనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1231 పెట్టుబడి రాయితీ, చిన్న, సూక్ష్మ పథకాల యూనిట్లలో ఒసి, బిసిలకు 15 శాతం, ఎస్‌సి, ఎస్‌టి లకు రూ.45 శాతం సబ్సిడీతో రూ.85.16 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. ఇందులోని 1,130 ఎస్‌సి, ఎస్‌టి యూనిట్లకు రూ.77. 05 కోట్లు రాయితీ రూపంలో రీయింబర్స్ చేయడం తెలిసిందే. తాజా పరిశ్రమల పాలసీలో పెట్టుబడి రాయితీ పథకం యూనిట్‌దారునికి 15 శాతం సబ్సిడీతో రూ.20 లక్షలు ప్రయోజనం చేకూరనుంది. ఒసి, బిసి మహిళలకు అదనంగా మరో రూ.10 లక్షల చొప్పున రూ.30 లక్షలు సబ్సిడీ లభించనుంది. కరెంటు యూనిట్‌కు రూపాయి చొప్పున వెసులుబాటు లభించనుంది. ఐదేళ్లపాటు యూనిట్ కార్యకలాపాలు నిర్వహించిన ఎస్‌సి, ఎస్‌టి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు 100 శాతం రీయింబర్స్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ల్యాండ్ కన్వర్షెన్ ఛార్జీల ద్వారా 25 శాతం సబ్సిడీ చొప్పున రూ.10 లక్షలు లభించే అవకాశాలు ఉంది. వైఎస్‌ఆర్ జగనన్న బడుగు వికాసం పథకం కింద సర్వీస్, మాన్యుప్యాక్షరింగ్ యూనిట్ల లబ్ధిదారులకు 45 శాతం సబ్సిడీ వర్తించనుంది. ఈలెక్కన ఎస్‌సి, ఎస్‌టి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ట్రాన్స్‌పోర్టు సెక్టార్‌లో అత్యధికంగా ఉన్నట్లు ఉండడం గమనార్హం. ఐదేళ్లపాటు యూనిట్‌ను కొనసాగిస్తే పెట్టుబడి మొత్తాన్ని రాయితీ రూపంలో రీయింబర్స్ చేస్తోంది. ఈలెక్కన మాన్యు ఫ్యాక్షరింగ్ యూనిట్ దారునికి సుమారు రూ.1.20 కోట్లు ప్రయోజనం చేకూరనుంది. ట్రాన్స్‌పోర్టు సెక్టార్‌లో సుమారు రూ.75 లక్షల మేర ప్రయోజనం లభించనుంది. స్టాంప్‌డ్యూటీ చెల్లింపుల దగ్గర నుంచి ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీల్లో 25 శాతం, కరెంటు ఛార్జీల్లో యూనిట్‌కు రూ.1.50, వడ్డీ రాయితీ కింద తొమ్మిది శాతం మేర ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. వీటితోపాటు టర్మ్‌లోన్లకు మూడు శాతం మేర గరిష్టంగా రూ.25 లక్షలు సబ్సిడీ లభించనుంది. ఏదేమైనా గత పరిశ్రమల పాలసీతో పోలిస్తే 2023-27 పాలసీలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ప్రయోజనాల్ని పెట్టుబడికి సమానంగా సబ్సిడీ, ఇతర ప్రయోజనాల్ని ముడిపెట్టారనే విమర్శ వినిపిస్తోంది.