జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
ప్రజాశక్తి - రంపచోడవరం
ఏజెన్సీలోని చదువుకొని ఖాళీగా ఉన్న యువతీ యువకులను గుర్తించి వారు చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక ఐటిడిఏ సమావేశ మందిరంలో ఏడు మండలాలకు చెందిన బ్యాంకు మేనేజర్లు,క వెలుగు ఏపీడి, డిపిఎం, చిన్న పరిశ్రమల ప్రాజెక్ట్ అధికారి తదితరులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, బడుగు వికాసం పథకానికి ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని మంజూరు చేశారు, ఇంకా బ్యాంకులలో ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో ఆరా తీశారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి వివిధ రకాలైన చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాలని కోరారు. ముందుగా ఒక్కొక్క మండలంలో పదిమంది లబ్ధిదారులను ఎంపిక చేసి, రుణాలు మంజరైన లబ్ధిదారులతో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురైన రైతులకు ట్రాక్టర్ల కోసం దరఖాస్తులు తీసుకోవాలన్నారు. మారేడుమిల్లి మండలం గుడిసె పర్యటక ప్రాంతానికి వచ్చే టూరిస్టులకు వాహనాల అద్దెకిచ్చే వాహనాలు మంజూరుకు దరఖాస్తులు స్వీకరించాలన్నారు. ఏజెన్సీలోని రైతులందరికీ క్రాప్ లోన్లు మంజూరు చేయాలన్నారు. నాటు సారా తయారు చేసి, అమ్ముతూ పట్టుబడి వారిని గుర్తించి వారు చేత చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే విధంగా రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఐటిడిఎ పిఒ సూరజ్ గనోరే, ఎస్‌బిఐ రీజనల్ మేనేజర్ ఎం.సురేష్ బాబు, ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాసరావు, లీడ్ బ్యాంకు మేనేజర్ రవితేజ, యూనియన్ బ్యాంక్ ఎజిఎం బిజిఆర్ నాయుడు, వెలుగు ఏపీడి ఎ.శ్రీనివాసరావు, డిపిఎంలు అపర్ణ, పరమేశ్వరరావు, యాంకర్ పర్సన్ రామరాజు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ రాజ్ కిషోర్ భార, స్టేట్ బ్యాంక్ మేనేజర్ ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు.










