Mar 25,2023 17:32

పోస్టర్‌ విడుదల చేస్తున్న జిల్లా ఎస్‌పి కె.రఘువీర్‌ రెడ్డి

చిన్న పిల్లలపై లైంగిక దాడులను అరికట్టండి
జిల్లా ఎస్‌పి కె.రఘువీర్‌ రెడ్డి
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

       చిన్న పిల్లలపై జరిగే లైంగిక దాడులను అరికట్టాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా ఎస్‌పి కె.రఘువీర్‌ రెడ్డి తెలిపారు. వరల్డ్‌ విజన్‌ ఇండియా నంద్యాల ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమం వారి ఆధ్వర్యంలో శనివారం స్థానిక మధుమణి ఈఎన్‌టి డాక్టర్స్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో పిల్లల భద్రత కమిటీ సభ్యులకు సామర్థ్యం పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ హాజరై మాట్లాడారు. 18 ఏళ్లలోపు వారిని చిన్నపిల్లలుగా గుర్తిస్తారని, ముఖ్యంగా తల్లిదండ్రులు వీరిపై ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలని చెప్పారు. ప్రతి చిన్న విషయం కూడా పిల్లలు తల్లిదండ్రులతో పంచుకునే అవకాశాన్ని ఇచ్చినప్పుడే సమాజంలో వారిపై జరుగుతున్న ఈ గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ల గురించి నిర్భయంగా చెబుతారని అన్నారు. పిల్లల ప్రతి కదలికను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తెలిపారు. ప్రతి గ్రామంలో, పట్టణంలోని వార్డులలో సచివాలయం ఏర్పాటు చేశారని, మహిళా సంరక్షణ కార్యదర్శులు, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, చైల్డ్‌ వెల్ఫర్‌ వాళ్లు ఉన్నారని, వీరు గ్రామాలలో ఇలాంటి లైంగిక దాడుల గురించి క్షుణ్ణంగా తెలుసుకొనే అవకాశం ఉందని, సమాచారాన్ని సంబందిత అదికారులకు అందించేలా పని చేయాలని తెలిపారు. వరల్డ్‌ విజన్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ తిరుపతిరావు మాట్లాడుతూ వరల్డ్‌ విజన్‌ 2019 నవంబర్‌ నుండి పలు రకాల ఆరోగ్యం, విద్య, జీవనోపాధి, పిల్లల భద్రత తదితర అంశాలపై ప్రభుత్వ సహకారంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి శారద మాట్లాడుతూ కోవిడ్‌ వలన ఏ కుటుంబం పిల్లలైనా అనాధలయినా, సింగిల్‌ పేరెంట్‌ చిల్డ్రన్‌ కలిగి ఉనాన వారికి గవర్నమెంట్‌ ద్వారా సహాయం అందుతుందని తెలియజేశారు. ఆళ్లగడ్డ, కర్నూలులో బాలల సంరక్షణ గృహాలు ఉన్నాయని చెప్పారు. దిశ యాప్‌ ఎస్సై కల్పనా మాట్లాడుతూ ప్రతి మహిళా దిశ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకొని భద్రత పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్టు అడ్వకేట్‌ దీప, జిల్లా బాలల పరిరక్షణ అధికారి శారద, ఐసిడిఎస్‌ సిబ్బంది పద్మజ, నరసింహులు, స్వచ్ఛంద సేవా సంస్థ బర్డ్స్‌ వెంకటేశ్వర్లు, మదర్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ రామారావు, ఐసిడిఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.