May 20,2023 19:59

సచివాలయంలో వివరాలు సేకరిస్తున్న జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్‌

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
చిన్నపెండేకల్‌ గ్రామంలో ఉపాధి అక్రమాలపై అధికారులు విచారణ చేపట్టారు. మండలంలోని చిన్నపెండేకల్‌లో పనులు చేయకుండానే రూ.లక్షలు స్వాహా చేస్తున్నారని, విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఇటీవల కలెక్టర్‌కు స్పందనలో ఫిర్యాదు చేశారు. శనివారం మండలంలోని చిన్న పెండేకల్‌ గ్రామంలో పర్యటించి ఉపాధి కూలీలతో, ఇరువు గ్రూపులతో జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్‌, ఏపీడీ లోకేష్‌, ఎంపిడిఒ గీతావాణి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. క్షేత్రస్థాయిలో, పని చేస్తున్న ప్రదేశాల్లో వేతనదారులతో మాట్లాడి సంబంధిత వ్యక్తి ఉపాధి పనులకు వచ్చారా, లేదా, పనికొస్తే ఎన్ని రోజులు వచ్చారు వంటి విషయాలను వేతనదారులను అడిగి తెలుసుకున్నామని తెలిపారు. ఇరు గ్రూపులను విచారణ చేసి నివేదికలను ఉన్నతాధికారులకు అందిస్తామని చెప్పారు.
ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించిన క్షేత్ర సహాయకులు, ఉపాధి పనులకు వెళ్లకుండా వెళ్లినట్లు అనధికార వ్యక్తులతో విచారణ జరపడం విమర్శలకు దారితీస్తోంది. వేతనదారుల సమక్షంలో విచారణ చేపడితే అసలు విషయం బయటపడుతుందని, నలుగురి మధ్య జరగాల్సిన విచారణ, నాలుగు గోడల మధ్య చేశారు. ఇలాంటి విచారణతో ఉపయోగం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇదే మాదిరిగా గ్రామాల్లో ఉపాధి హామీ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు, ఇందుకు సీనియర్‌ మేటీలు చక్రం తిప్పుతున్నారని ఆయా గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు.