
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
చిన్న వయసులో నేర్చుకున్న సంగీతం వారి జీవితాలలో చాలా ప్రభావం చూపుతోందని, సంగీతం నేర్చుకోవాలని ప్రభుత్వ సంగీత ఉపాధ్యాయులు జువ్వల రాజ్ కుమార్ తెలిపారు. ఆదివారం స్థానిక త్రివేణి ప్రసాద్ కళాశాల ప్రాంగణంలో పూర్విక సంగీత సాగరం సంగీత పాఠశాల ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ సంగీతం నేర్చుకొనే వారికి తెలియకుండానే క్రమశిక్షణ అలవడుతుందని తెలిపారు. రాబోయే కాలంలో సంగీతం అభ్యసిస్తున్న చిన్నారులు ఎన్నో విజయాలు సాధిస్తారన్నారు. పూర్విక సంగీత సాగరం సంగీత పాఠశాల నిర్వాహకులు సోడెం విజయ రాజ్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలోని హర్షవర్థన్ హాస్పిటల్ పక్కన మొట్టమొదటి సారిగా ప్రారంభించిన పూర్విక సంగీత సాగరం సంగీత పాఠశాల గత సంవత్సరం విద్యార్థులకు గాత్ర సంగీతం, కీబోర్డ్, గిటార్, ఫ్లూట్‌లలో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. పిల్లలు కచేరి చేసే స్థాయికి రావటం చాలా గర్వంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జానపద కళారత్న అవార్డు గ్రహీత కృష్ణబాబు, నాట్య మయూరి శ్రీరూపదేవి, ట్రంపేట్ విద్వాన్ షేక్ లాల్ సాహెబ్, విద్యార్థుల తల్లిదండ్రులు, కళాకారులు పాల్గొన్నారు.