చిన్న చెరువు టూరిస్ట్ రెస్టారెంట్ అభివృద్ధి పనులను వేగవంతం చేయండి.
జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్.
ప్రజాశక్తి, నంద్యాల కలెక్టరేట్
చిన్న చెరువు గట్టుపై టూరిస్ట్ రెస్టారెంట్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి దసరా పండుగ లోపు పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్నిచ్చేలా అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ గ్రీన్ కో ప్రతినిధులను సూచించారు. శనివారం నంద్యాల పట్టణంలోని చిన్న చెరువు గట్టుపై టూరిస్ట్ రెస్టారెంట్ వద్ద గ్రీన్ కో ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డితో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్నిచ్చే రీతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పూర్తి చేసి దసరా పండుగ లోపు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని గ్రీన్ కో ప్రతినిధులను సూచించారు. రెస్టారెంట్ బిల్డింగ్ పునర్నిర్మాణ పనులు, చిన్నపిల్లల ఆట వస్తువులకు సంబంధించిన పరికరాలు, జిమ్, ల్యాండ్ స్కేపింగ్, వాకింగ్ ట్రాక్, చెరువు చుట్టూ ప్రమాద నివారణ నిమిత్తం ఏర్పాటు చేసే ఐరన్ రక్షణ ఫెన్సింగ్, ఫుడ్ కౌంటర్ తదితర పనులను త్వరితగతిన పూర్తి చేసి పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. పెండింగ్లో ఉన్న పనులను వేగవంతంగా నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. చెరువులో బోటింగ్ చేసేందుకు వీలుగా అందుబాటులో ఉంచిన మోటార్ బోట్లు, ఫెడల్ బోట్లను కలెక్టర్ పరిశీలించారు. చిన్న చెరువు రెస్టారెంట్లో జరుగుతున్న పనుల ప్రగతిపై జిల్లా టూరిజం అధికారి సత్యనారాయణ కలెక్టర్ కు నివేదించారు.










