Sep 12,2021 13:23

చిన్న చేపల్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ఇవి తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటితో రకరకాల వంటలను సులభ పద్ధతిలో చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం పదండి.

                                                                  చింతకాయతో..

చిన్న చేపలు ఆరోగ్యానికి మేలు

కావాల్సిన పదార్థాలు : చిన్న చేపలు- అరకేజీ, ఉల్లిపాయ- ఒకటి (మీడియం సైజు), పచ్చిమిర్చి- నాలుగు (నిలువుగా చీల్చాలి), కరివేపాకు- తగినంత, చింతకాయలు- పది (ఉప్పువేసి దంచి పెట్టుకోవాలి), జీలకర్ర- చిటికెడు, పసుపు- అరస్పూను, అల్లంవెల్లుల్లి పేస్టు- చిన్నముద్ద, కారం- స్పూను, చేపల మసాలాపొడి- స్పూను, ఆవకాయ నూనె- రెండు స్పూన్లు.

తయారుచేసే విధానం : 

  • ముందుగా చేపలను గిన్నెలోకి తీసుకుని, రాళ్ల ఉప్పు వేసి బాగా రుద్దాలి. ఆ తర్వాత నీళ్లతో రెండు, మూడుసార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి.
  • ముందుగా పాన్‌ తీసుకుని అందులో నూనె వేసి వేడెక్కాక జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకును వేసి వేగించాలి.
  • అందులోనే ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి రెండు నిమిషాలు మూతపెట్టి వేగనివ్వాలి.
  • తర్వాత అల్లంవెల్లుల్లి పేస్టును వేసి, పచ్చివాసన పోయేవరకు వేగించాలి. ఇంకా కారం, చేపల మసాలాపొడిని కలపాలి.
  • అందులోనే శుభ్రపరిచిన చిన్న చేపలను వేసి, ఒకసారి గిన్నెను తిప్పుకోవాలి.
  • తర్వాత ముందుగా దంచి ఉంచుకున్న చింతకాయ పేస్టును, ఉప్పును వేసి కలపాలి.
  • ఇప్పుడు కొద్దిగా నీళ్లు చల్లి, ఉడికించుకోవాలి. అది ఉడికే సమయంలో రెండు స్పూన్ల ఆవకాయ నూనె కలపాలి.
  • స్టౌ సిమ్‌లో పెట్టుకునే, కూర దగ్గరకు వచ్చేవరకూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గిన్నె తిప్పుకోవాలి. గరిటెతో తిప్పకూడదు. చేపలు చిదురైపోతాయి.
  • కూర ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి, దించేసుకోవాలి.


                                                                     వేపుడు

చిన్న చేపలు ఆరోగ్యానికి మేలు

కావాల్సిన పదార్థాలు :  చిన్న చేపలు - పదిహేను, కారం - రెండు టేబుల్‌స్పూన్లు, ధనియాల పొడి - టీస్పూను, జీలకర్ర పొడి - టీస్పూను, పసుపు - పావు స్పూను, అల్లంవెల్లుల్లి పేస్టు - మూడు టీస్పూన్లు, మొక్కజొన్న పిండి - టేబుల్‌స్పూను, బియ్యప్పిండి - టేబుల్‌స్పూను, నిమ్మరసం - టేబుల్‌స్పూను, ఉప్పు - రుచికి తగినంత, ఉల్లిపాయ - ఒకటి, కరివేపాకు - కొద్దిగా.

తయారుచేసే విధానం :

  • ముందుగా చేపలను ఉప్పు వేసి, శుభ్రంగా కడగాలి.
  • తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్రపొడి, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు, నిమ్మరసం వేసి కలపాలి.
  • అందులోనే మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, ఉప్పు వేసి కలుపుకొని, పదినిమిషాలు అలా ఉంచాలి.
  • స్టౌపై పాన్‌ పెట్టి, నూనె వేసి కాస్త వేడయ్యాక, కలిపి పెట్టుకున్న చేపలను వేసి, వేపాలి.
  • మరొక పాన్‌లో కొద్దిగా నూనె, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేగించుకోవాలి. వాటితో వేపిన చేపలను గార్నిష్‌ చేసుకోవాలి.

                                                                ఇగురు

చిన్న చేపలు ఆరోగ్యానికి మేలు

కావాల్సిన పదార్థాలు : చిన్న చేపలు- 200 గ్రా, ఉల్లిపాయ- ఒకటి, అల్లం- 5,6 ముక్కలు, వెల్లుల్లి- 5,6 రెబ్బలు, మిరియాల పొడి- స్పూను, ఉప్పు- తగినంత, పసుపు- పావుస్పూను, నూనె- మూడు స్పూన్లు, గరం మసాలా- పావు స్పూను, పచ్చిమిర్చి- ఐదు లేదా ఆరు, కరివేపాకు- కొంచెం, కారం- తగినంత.

తయారుచేసే విధానం :

  • ముందుగా చిన్న చేపలను శుభ్రంగా కడగాలి.
  • మిక్సీ జారు తీసుకుని అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, గరంమసాలా వేసి, పేస్టులా తయారుచేసుకోవాలి.
  • ఆ పేస్టుని చేపల్లో వేసి, బాగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టాలి.
  • తర్వాత స్టౌపై పాన్‌పెట్టి అందులో నూనె వేయాలి. అది వేడెక్కాక మసాలా కలిపి పెట్టిన చిన్న చేపలను అందులో వేసి మూతపెట్టాలి.
  • ఐదు లేదా పది నిమిషాలు ఉడికించాలి. అందులో కొద్దిగా కరివేపాకు వేసి దించేయాలి. అంతే చిన్నచేపల ఇగురు రెడీ.

                                                                  పులుసు

చిన్న చేపలు ఆరోగ్యానికి మేలు

కావాల్సిన పదార్థాలు : చిన్న చేపలు- అరకేజీ, పచ్చిమిర్చి- నాలుగు (సన్నగా చీల్చాలి) ధనియాల పొడి- స్పూను, జీలకర్ర- అరస్పూను, జీలకర్ర పొడి- అరస్పూను, పసుపు- పావుస్పూను, ఉల్లిపాయలు- మూడు (కచ్చాపచ్చాగా దంచుకోవాలి), టమాటాలు- మూడు (సన్నగా తరుక్కోవాలి), అల్లంవెల్లుల్లి పేస్టు- టీస్పూను, నానబెట్టుకున్న చింతపండు- పెద్ద నిమ్మకాయ సైజు, నూనె- ఒకటిన్నర స్పూను, పచ్చికారం- రెండు స్పూన్లు, ఉప్పు- తగినంత, వెనిగర్‌ లేదా నిమ్మరసం- కొంచెం.

తయారుచేసే విధానం :

  • ముందుగా చిన్నచేపలను ఉప్పు, వెనిగర్‌ వేసి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
  • అందులో పచ్చికారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పును వేసి బాగా కలిపి అరగంట ఉంచాలి.
  • స్టౌ మీద పెద్దపాన్‌ పెట్టి, అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కాక జీలకర్ర, పచ్చిమిర్చిని వేసి రెండు నిమిషాలు వేగించాలి. తర్వాత ఉల్లిపాయ ముద్దను వేసి, బంగారు వర్ణం వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • అందులోనే అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపును వేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత టమోటా ముక్కలు వేసి, అవి మెత్తపడే వరకూ ఉడకనివ్వాలి.
  • చింతపండు గుజ్జును వేసి కలపాలి. గ్రేవీకి తగ్గట్టు నీళ్లు పోసుకోవాలి. అందులోనే సిద్ధం చేసుకున్న చేపలను వేసి బాగా కలపాలి.
  • పావు గంట సేపు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకోవాలి. అంతే చిన్న చేపల పులుసు రెడీ.