ప్రజాశక్తి-ఆలూరు
నంద్యాలలోని దళిత యువకుడు చిన బాబు మృతికి కారణమైన నంద్యాల ఎస్‌ఐని సస్పెన్షన్ చేయాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షులు జి.మహానంది కోరారు. బుధవారం ఆయన ఆర్‌అండ్‌బి గెస్ట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. నంద్యాలలోని తోటి లైనులో నివాసం ఉన్న చినబాబు (22)ను పోలీసులు బైక్ దొంగతనం కేసులో అక్రమంగా కేసు పెట్టి చిత్రహింసలకు గురి చేసి శారీరకంగా, మానసికంగా విచక్షణ రహితంగా కొట్టారని తెలిపారు. పరుష పదజాలంతో తిట్టారని, చేయని నేరాన్ని ఒప్పుకోమని బలవంతం చేసినట్లు తెలిసిందన్నారు. మనస్తాపానికి గురైన చినబాబు నందిపల్లె రైల్వే ట్రాక్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. చినబాబు మృతికి కారణమైన ఎస్‌ఐని సస్పెన్షన్ చేసి బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొలగవల్లి నాగరాజు, పెద్దగోనెహాల్ గోపాల్, హత్తిబెళగల్ లక్ష్మీనారాయణ, మల్లి, భరత్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న మహానంది










