ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ
గోదావరి ముంపునకు గురైన అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరుకు జివిఎంసి నుంచి పారిశుధ్య కార్మికులు తరలివెళ్లారు. మంగళవారం వారు జివిఎంసి ప్రధాన కార్యాలయం నుంచి అదనపు కమిషనర్ వై.శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రత్యేక బస్సుల్లో బయలుదేరారు. ఈ సందర్భంగా మేయర్ హరి వెంకట కుమారి, కమిషనర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రభుత్వం, ఎంఎ అండ్ యుడి ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, సిడిడిఎంఎ ప్రవీణ్ కుమార్ ఆదేశాల ప్రకారం వీరంతా అక్కడకు సేవలందిం చేందుకు సిద్ధమయ్యారన్నారు. చింతూరుకు జివిఎంసిలోని ప్రతి జోన్ నుంచి 20 మంది చొప్పున పారిశుధ్య కార్మికులను పనిముట్లుతో సహా పంపించినట్లు అధికారులు తెలిపారు. ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు మానవతా దృక్పథంతో సహాయ సహకారాలు అందించాలని కమిషనర్ లక్ష్మీశ తెలిపారు. గతంలో హుదూద్ సైక్లోన్ సంభవించినప్పుడు విశాఖ వాసులు పడిన బాధలు, ఇబ్బందులు ఇంకా గుర్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎఎంఒహెచ్ కిరణ్ కుమార్, శానిటరీ సూపర్‌వైజర్లు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.










