Oct 26,2022 23:46

మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం

ప్రజాశక్తి - ఎటపాక
నాలుగు ముంపు మండలాలకు చింతూరు కేంద్రంగా కొత్తగా రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం ప్రకటించడం పట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం హర్షం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటైన ఈ రెవెన్యూ డివిజన్‌కు ఐఏఎస్‌ అధికారిని నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోయం వీరమ్మ అధ్యక్షతన ఎర్రబోరులో పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా మంతెన మాట్లాడుతూ జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో నాలుగు దఫాలు గోదావరి వరద నాలుగు మండలాల్లో పెను విధ్వంసం సృష్టించిందని తెలిపారు. ఆ సమయంలో ప్రజలకు తక్షణమే సహాయ చర్యలు చేపట్టి ఆదుకోవడంలోనూ, ముందస్తు ఏర్పాట్లు చేయడంలోనూ ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందన్నారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలన్నా, వరద బాధితులకు తక్షణమే సహాయం చేయాలన్నా ప్రభుత్వ పటిష్ట యంత్రాంగం అవసరమని, వారికి ఐఏఎస్‌ అధికారి నాయకత్వం వహించాలని సూచించారు. చింతూరు ఐటీడీఏకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు. వరదల సమయంలో ప్రజలకు అండగా ఉండి భరోసా ఇస్తూ క్షేత్రస్థాయిలో సహాయ చర్యల్లో పాల్గొన్న పార్టీ కార్యకర్తలను ఆయన అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా సిపిఎం పనిచేస్తుందని నిరూపించామన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎక్కడికక్కడ పనిచేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు, మండల కార్యదర్శి ఐవి, పార్టీ నాయకులు ఇరపా అజరు కుమార్‌, కాకా అర్జున్‌ దొర, ఐ పద్మ, పులుసు బాలకృష్ణ, జి హరనాధ్‌, సవలం రాము, ఇరపా సత్యం, లింగాల వెంకన్న, అపకా సమ్మక్క, బండారు స్టాలిన్‌, నూతలపాటి సుధాకర్‌, తోట శ్రీను తదితరులు పాల్గొన్నారు.