Jun 17,2023 00:30

మాట్లాడుతున్న ఎంపిటిసి అంపరంగి బుజ్జిబాబు

ప్రజాశక్తి -సీలేరు
చింతపల్లి మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి పూర్తిస్థాయి పోస్టుమార్టం నిర్వహించే వైద్య అధికారిని నియమించాలని, మృతదేహాలను తరలించడానికి నూతనంగా అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలని జికె.వీధి మండలం ధారకొండ ఎంపిటిసి సభ్యులు అంపరంగి బుజ్జిబాబు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ చింతపల్లి ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించే పర్మినెంట్‌ వైద్యాధికారి లేక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించేటప్పుడు అనేక ఇబ్బందులు గురవుతున్నట్లు చెప్పారు. ప్రమాదవస్తు మరణాలు సంభవిస్తే పోస్టుమార్టం నిర్వహించడానికి తమ గ్రామం నుంచి చింతపల్లి తరలించడానికి అంబులెన్స్‌ లేక అనేక ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు. తమ గ్రామాల నుండి చింతపల్లి తరలించాలంటే 50 కిలోమీటర్లు ఉంటుందని, ప్రైవేటు వాహన యజమానులు రూ.4000 నుంచి రూ.8000 వరకు కిరాయి డిమాండ్‌ చేస్తున్నారని తెలిపారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్న గిరిజనులు అంత డబ్బులు చెల్లించాలంటే తలకుమించిన భారంగా తయారైందని పేర్కొన్నారు. గాలికొండ పంచాయతీ సప్పర్ల పిహెచ్‌సిలో అంబులెన్స్‌ అందుబాటులో లేక అత్యవసర సమయాల్లో వైద్య సేవలు పొందాలన్నా, మృతదేహాలను తరలించాలన్నా చాలా ఇబ్బందులకి గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా కలెక్టర్‌ స్పందించి నూతనంగా వైద్యాధికారిని నియమించాలని, అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలని బుజ్జిబాబు కోరారు. ఈ సమావేశంలో దారకొండ వైస్‌ సర్పంచ్‌ చంటిబాబు, గాలికొండ సర్పంచ్‌ కాకూరు బుజ్జిబాబు, ఎ.దారకొండ సర్పంచ్‌ మురల రామారావు తదితరులు పాల్గొన్నారు.