ప్రజాశక్తి-కందుకూరు :వలేటివారిపాలెం మండలం రామ చంద్ర పురం రెవెన్యూ గ్రామంలోని అంక భూపాలపురంలోని సర్వేనెంబర్ 192,193 ,194 లలో ఉన్న 60ఎకరాల భూమిని 1984లో అప్పటి ప్రభుత్వం దళితులకు పట్టాలు ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం ఆభూమిని గ్రామంలోని అగ్రవర్ణ రైతులు ఆక్రమించుకొని సాగు చేసుకున్నారని సిపిఎం వలేటివారిపాలెం మండల ఇన్చార్జి జివిబి కుమార్ పేర్కొన్నారు. ఆదివారం నాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న సమరభేరి కార్యక్రమంలో భాగంగా అంక భూపాలపురం ఎస్సీ కాలనీలో సిపిఎం నాయకులు పర్యటన చేశారు. కరపత్రాలను పంచారు. ఎస్సీ కాలనీలో జెండా సెంటర్ వద్ద దళితులను ఉద్దేశించి కుమార్ మాట్లాతూ సెంటు భూమి లేకుండా రెక్కల కష్టంతో బ్రతుకుతున్న దళితులకు 1984లో ప్రభుత్వ ఇచ్చిన భూములను అగ్రవర్ణ రైతులు ఆక్రమించుకొని, సాగు చేసుకుంటూ దళితులను నానా ఇబ్బందులు గురి చేస్తున్నారని విమర్శించారు. ఈ సమస్యపై అనేక దఫాలుగా రెవిన్యూ అధికారులను కలిసి సమస్యను వివరించినా ఏమాత్రం సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. రెవిన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు దళితులకు ఇచ్చిన భూములను వారిని సాగు చేసుకోనివ్వకుండా అడ్డుపడితే ఆపాల్సిఉంటే చోద్యం చూస్తున్నారు అని పేర్కొన్నారు. దళితుల భూములను అక్రమంగా ఆక్రమించుకున్న అగ్రవర్ణ రైతులపై కేసులు నమోదు చేసి ఆ భూములను దళితులకు ఇవ్వాలని, దళితులు ఆ భూములను సాగు చేసుకునేటట్లు తోడ్పడాలని కోరారు. లేనట్లయితే దళితులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం వలేటివారిపాలెం మండల నాయకులు దువ్వూరి జాన్ ,సాధు చెన్నకేశవులు, స్థానికులు అత్యాల యాకోబు, మల్లెల అంజయ్య, మంగి లాజర్, మంగి సురేష్,డొక్కా చిన నరసయ్య,మంగి కొండయ్య తదితరులు పాల్గొన్నారు.










