మామిడి రైతులను ఆదుకుంటాం
మల్లవల్లి టౌన్‌షిప్ నిర్మించి ఉద్యోగాలిస్తాం
నూజివీడు ఎంఎల్‌ఎ కుమారుడు నిలువు దోపిడీ
ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలి
నూజివీడు పర్యటనలో చంద్రబాబు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి, నూజివీడు, రూరల్
అధికారంలోకి రాగానే చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి ప్రతి ఎకరానికీ నీరందిస్తామని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం నూజివీడు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. మర్రిబంధం నుంచి చంద్రబాబు రోడ్డుషో కొనసాగింది. టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బైకులు, కార్లపై వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. క్రేన్‌తో గజమాల వేసి ఆహ్వానించారు. జనం పెద్దఎత్తున రోడ్డుపైకి రావడంతో రోడ్డుషో నెమ్మదిగా సాగింది. పలుచోట్ల మహిళలు హారతులు ఇచ్చి చంద్రబాబుకు ఆహ్వానం పలికారు. రాత్రి 9 గంటలకు నూజివీడులోని పెట్రోల్ బంకు సెంటర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణానికి చంద్రబాబు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోయాయంటూ సిలిండర్ చూపించింది. తొలుత టిడిపి జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాట్లాడారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ రైతులు, కూలీలు, తోపుడుబళ్లవారు, కార్మికులు ఏ ఒక్కరినీ జగన్ వదల్లేదన్నారు. ముద్దులకు మోసపోయి పిడిగుద్దులు తింటున్నారన్నారు. సంపద సృష్టి లేకుండాపోయిందన్నారు. రూ.60 ఉండే మద్యం సీసాను రూ.200 నుంచి రూ.300 వరకు పెంచారన్నారు. మద్యంపై వచ్చే పర్సంటేజీ ఎక్కడికి పోతుందన్నారు. జగన్ పాలన చూసి విద్యార్థులు తెలంగాణ ఎంసెట్‌కు వెళ్లిపోతున్నారన్నారు. రూ.లక్షల కోట్లు జగన్, ఎంఎల్‌ఎలు దోచుకుతింటున్నారన్నారు. పోలవరం పోయిందని, చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని సర్వనాశనం చేశారన్నారు. బందరు పోర్టు పోయిందని, భోగాపురం విమానాశ్రయం, కడప స్టీల్ ప్లాంట్ ఏ ఒక్కటీ లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నూజివీడు నియోజకవర్గంలో మల్లవల్లి టౌన్‌షిప్ నిర్మించి రూ.50 వేల ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ చేపడతామన్నారు. మామిడి అంటేనే నూజివీడుకు ప్రత్యేకత ఉందని మొన్నటివరకు రూ.40 వేలు ఉన్న ధర రూ.8 నుంచి 10 వేలకు పడిపోయిందన్నారు. వర్షాలకు పంట దెబ్బ తిన్నా ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. టిడిపి అధికారంలో ఉంటే మామిడి రైతులను ఆదుకునేవారమన్నారు. పామాయిల్ పంటను కూడా టిడిపి తెచ్చిందని, ధర తగ్గితే సబ్సిడీ ఇచ్చేవారమని చెప్పారు. రైతులకు ఒకేసారి రూ.50 వేలు రుణమాఫీ చేశామని తెలిపారు. ధాన్యం కొనుగోలు సక్రమంగా చేసేవారమన్నారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందన్నారు. అధికారంలోకి వచ్చాక రైతులను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. నూజివీడుకు ఔటర్ రింగురోడ్డు కావాలంటున్నారని, టిడిపి వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పారు. నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్లను బాగుచేయిస్తామని, ట్రిపుల్ ఐటీని అభివృద్ధి చేస్తామన్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెటు ్టకోవాలనే చందంగా ఎంఎల్‌ఎ కుమారుడు దుకాణం పెట్టేశారన్నారు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల్లో బరితెగిం చారన్నారు. ఉచితంగా ఇసుక ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆగిరిపల్లి మండలంలో క్వారీలు కొల్లగొడుతు న్నారన్నారు. నూజివీడులో రూ.300 కోట్లతో 3100 టిడ్కో ఇల్లు నిర్మిస్తే లబ్ధిదారులకు ఇవ్వకుండా పాడు పెట్టేశారన్నారు. నూజి వీడును ఎన్‌టిఆర్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నా రని, జిల్లాల విభజనలో ఉన్న సమస్యలను అధికారంలోకి వచ్చాక సరిచేస్తామన్నారు. పేదల ఆర్థిక అసమానతలు తొలగించేందుకు, నిరుపేదలను గుర్తించి అండగా ఉండే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. తన పర్యటనకు సంబంధించి స్థానిక డిఎస్‌పి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని, తాము అధికారంలోకి వచ్చాక పొరపా ట్లు చేసే అధికారులను వదలబోమని హెచ్చరించారు. ప్రజలు మారాలని, చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాగంటిబాబు, స్థానిక టిడిపి నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.










