
ఈ ప్రకృతిలో ప్రతి చెట్టుకూ ఓ విశిష్టత ఉంటుంది. ప్రతి వృక్షంలోనూ ఏదో ఒక ఔషధ గుణం దాగి ఉంటుంది. అలాగే చింతలోనూ ఎన్నెన్నో వింతలు దాగి ఉన్నాయి. సాధారణంగా మనకు చింత ఆహారంగానే తెలుసు. అయితే ఈ చెట్టు కలప నుంచి విత్తు వరకూ ప్రతిదానిలోనూ ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అంతేకాదు.. చింత చెట్టుపై అనేక సినిమా పాటలు, జానపదాలు.. చిన్నపిల్లల గెేయాలు ఉన్నాయి. లోకో భిన్న రుచి అన్నారు.. అలాగే ఈ భూమ్మీద ఎన్ని రుచులు ఉన్నాయో అన్ని రకాలలోనూ చింత పులుపును ఏదో విధంగా ఉపయోగిస్తుంటారు. సాధారణంగా వంటల్లోనే చింతపండును వాడతారని మనకు తెలుసు. కానీ చింత గింజలను బిస్కెట్లలోనూ... ఆయుర్వేద మందుగానూ వాడతారు. చింత చెట్టు కలపతో గృహోపకరణాలనూ తయారుచేస్తారు. ఇక సామెతల గురించి చెప్పనవసరం లేదు.. 'మంత్రాలకు చింతకాయలు రాలవు.. చింత చచ్చినా పులుపు చావదు..' అనే సామెతలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. మరి ఇన్ని రకాలుగా మానవుని జీవితంతో పెనవేసుకున్న చింతపైనే ఈ కథనం..
చింతపండు పేరు చెబితే చాలు.. చాలామంది నోటి వెంట లాలాజలం ఉబికి వస్తుంది. సాధారణంగా చిగురాకులు, చింత పువ్వు, పండ్లలో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఎండాకాలం వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది చింతచిగురు రసం, చింత పులుసు, చింతచిగురు పప్పు చేసుకుని తింటూ ఉంటారు. దీనివల్ల శరీరం వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుందనే. అయితే మన దేశంలో ప్రతి ఇంట్లోనూ చింతపండు ఉంటుంది. ఏదో ఒక రకంగా ఆహార పదార్థాల తయారీలో చింతపండును విరివిగా వాడుతుంటారు. ఇక చింతపండులో ఖనిజాలు, యాంటిఆక్సిడెంట్లు, ఫైటో కెమికల్స్, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీర పనితీరును మెరుగుపరుస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఇలాంటి ఎన్నో సుగుణాలున్న చింత వాస్తవానికి మన దేశానికి చెందినది కాదని ఎంత మందికి తెలుసు ?
ఉనికి ఆఫ్రికాది.. పేరు అరేబియాది..

చింతను 'ట్రామరిండస్ ఇండికా' అని వృక్ష శాస్త్రంలో పిలిచినా, నిజానికి దాని మూలం ఆఫ్రికా ఖండం. అయితే పాకిస్తాన్, ఇండియాలో బాగా పెరుగుతుంది. ప్రస్తుతం ఈ వృక్షం ప్రపంచమంతా వ్యాపించి ఉంది. అయితే దీని ఉనికేమో ఆఫ్రికా, పేరేమో అరేబియాది. ప్రాచుర్యం పొందింది మాత్రం మనదేశం ద్వారానే. అందులోనూ తెలుగువాళ్ల పాక ప్రావీణ్యంతోనే మరింత పేరొందింది. చింతచిగురు పచ్చడి నుంచి చింతచిగురు చికెన్ దాకా తెలుగువాళ్లు చేయని ప్రయోగం లేదంటే అతిశయోక్తి లేదు.
'ట్రామరిండ్' అనే మాట 'టామర్' అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. టామర్ అంటే 'డేట్'.. డేట్ అంటే ఖర్జూరం అని అరబిక్‌లో అర్థం. 'ఇండ్' అంటే ఇండియా. 'ట్రామరిండ్' అంటే 'డేట్స్ ఆఫ్ ఇండియా' అని అర్థం. అందుకే చింతపండును 'భారతదేశపు ఖర్జూరం'గా పిలుస్తారు.
ఆఫ్రికాలోని సవానాలు అనే గడ్డి మైదానాలు చింతచెట్టు తొట్టతొలి జన్మస్థలమని శాస్త్రజ్ఞుల నిర్ధారణ. అయితే ఇది భారతదేశంలోకి చరిత్ర పూర్వయుగాల్లోనే ప్రవేశించిందని వారి భావన. అందుకే దీన్ని భారతదేశపు వృక్షంగానే భావించి, వృక్ష వర్గీకరణలోనే దీని శాస్త్రీయ నామాన్ని 'ఇండికా' (భారతీయ వృక్షం) అనే అన్నారు. భారతదేశాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు మార్కోపోలో క్రీ.శ. 1298లో దీనిని 'టామరింది' అన్నాడు.
పేరు.. తీరు..
చింతను సంస్కృతంలో 'చించా' అనీ, 'తింత్రిణీ' అనీ, 'ఆమ్లికా' అనీ అంటారు. నోట్లో వేసుకుంటే చిమచిమ అంటుంది కనుక దీనికి 'చించా' అనీ.. వేసుకోగానే నీళ్లూరతాయి కనుక 'తింత్రిణీ' అనీ.. పుల్లగా ఉంటుంది కనుక 'ఆమ్లికా' అనే పేర్లు వచ్చాయి. దీని సంస్కృత పేరు 'చించా' నుంచే తెలుగు శబ్దం 'చింత' ఏర్పడింది. 'ఆమ్లికా' నుంచే 'ఆమ్లీ', 'ఇమ్లీ' ఏర్పడ్డాయి. తమిళంలో దీన్ని 'పుళి' అనీ, 'అమిళం' అనీ అంటారు. మన అభిమాన వంటకం పులిహోర. ఈ పేరు పుళి నుంచి ఏర్పడినదే. ప్రఖ్యాత ఇటాలియన్ వృక్ష శాస్త్రజ్ఞుడు అయిన యాండ్రియాస్ సీజాల్పిని (క్రీ.శ. 1519-1603) పేరిట ఏర్పరచిన సీజాల్పినియేసీ కుటుంబానికి చెందిన వృక్షమిది.
చిలిపి సరదాలు..
ఇప్పుడంటే అమ్యూజ్‌మెంట్ పార్కులు, వీడియోగేమ్స్ వచ్చాయి కానీ.. పదేళ్లు వెనక్కి వెళ్తే.. గ్రామాల్లో పిల్లలు చింతచెట్లు ఎక్కి, కోతి కొమ్మచ్చులు.., అచ్చెనగుల్ల, వామనగుంతలు, అష్టాచెమ్మా ఆడుకునేవారు.. చింతచెట్లకు ఉయ్యాలలు కట్టి ఊగేవారు.. మరికొందరైతే రోడ్ల వెంబడి పాట పెట్టిన (వేలం వేసిన) చెట్ల కాయలను రాళ్లతో కొడుతూ కాపలా కాసేవారిని ఆట పట్టించేవారు.. అలా దొంగిలించిన చింతకాయలతో లాలీపాప్స్‌లా చేసుకుని ఉప్పు, కారం కలుపుకుని తినేవారు.
ఇందులో ఏమున్నాయి ?
చింతపండులో 50 శాతం చక్కెర ఉంటుంది. అయితే దీనిని చింతకు పులుపునిచ్చే టార్టారిక్ యాసిడ్ డామినేట్ చేస్తుంది. టార్టారిక్ యాసిడ్‌కు తీవ్రమైన అమ్లగుణాలు ఉంటాయి. టార్టారిక్ యాసిడ్ (20 శాతం) చింతలో సమృద్ధిగా లభిస్తుంది. ఇంకా టెర్పీన్స్, ఫినైల్ ప్రొపనాయిడ్స్, మిథైల్ శాలిసిలేట్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి. ప్రొటీన్లు, మినరల్స్, కార్బొహైడ్రేట్స్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, కాపర్, మాంగనీస్, జింక్, కెరొటీన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలూ ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవేకాక విటమిన్- సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది గొప్ప రోగ నిరోధక వనరుగా ఉపయోగపడుతుంది. యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్ గుణాలు దీంట్లో ఉన్నాయి.
రకాలు..
చింతలో కొన్ని రకాలు మాత్రమే ఉన్నాయి. మనదేశంలో ముఖ్యమైన రకాలు..
పికెఎమ్-1 : ఇది 39 శాతం గుజ్జు కలిగి ఉంటుంది. ఈ రకం ఒక చెట్టుకు 263 కిలోల కాయలను ఇస్తుంది. 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు ఉంటుంది.
ఉరిగం : ఇది తీపి గుజ్జు కలిగి, చాలా పొడవైన కాయలను అందించే మరొక స్థానిక రకం.
ప్రతిస్థాన్ : మరాఠ్వాడా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదల చేయబడింది. 60 శాతం గుజ్జు కలిగి ఉంటుంది. ఈ గుజ్జులో ఎనిమిది శాతం టార్టారిక్ ఆమ్లం ఉంటుంది.
యోగేశ్వరి : ఇదీ మరాఠ్వాడా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదల చేయబడింది. ఇది ఎరుపు గుజ్జు కలిగి ఉంటుంది. ఈ రకం చింత 11 శాతం ఆమ్ల గుణంతో, అధిక దిగుబడి ఇచ్చే రకం.
అనంత రుధిర : అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం రేకులకుంటలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యానవన పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. పిందెను విరిచి చూస్తే రక్తం మాదిరిగా ఎర్రగా కండ కనిపిస్తుంది. కాయ ముదిరిన తర్వాత రోజ్‌రెడ్‌లోకి మారుతుంది. యాంటోసైనిన్స్ అనే పిగ్‌మెంట్ కారణంగా ఎరుపు రంగు వస్తుంది.
ఈ పరిశోధనా స్థానంలో 40కి పైగా రకాల చింతచెట్లను సాగు చేస్తూ పరిశోధనలు సాగిస్తున్నారు. వీటిలో 30 ఏళ్ల వయసున్న ఒక చెట్టు కాయల్లో గుజ్జు ఎర్రగా ఉన్నట్లు గుర్తించి, దీనికి 'అనంత రుధిర', 'ఎర్ర చింత', 'ఛాంపియన్ ట్రీ' అని పేరుపెట్టారు. దీంతో పాటు తెట్టు అమాలిక, ధార్వాడ్ సెలక్షన్-1, ధార్వాడ్ సెలక్షన్-2 రకాల అంటుమొక్కలూ అందుబాటులో ఉన్నాయి.
ఉత్పత్తులు..

మామూలు చింత రకాల నుంచి వచ్చే చింతకాయల ద్వారా చింత తొక్కు, చింతపండుగానే ఎక్కువగా ఆహారంగా ఉపయోగిస్తారు. అయితే చింతతో అనేక ఇతర ఉత్పత్తులను తయారుచేసుకోవచ్చు. చింతపండును వినియోగించి జామ్, జెల్లీ, సాస్, చిక్కటిగుజ్జు, పొడి, టోఫీస్ (చాక్లెట్లు), బేకరీ పదార్థాలు తయారుచేస్తున్నారు.
ఇవి కాకుండా వీటిని సాంప్రదాయ ఔషధాలు, మెటల్ పోలిష్ మొదలైన వాటిలో ఉపయోగిస్తారు.
కొన్ని పానీయాల తయారీలోనూ విస్తృతంగా వాడతారు.
ఆసియాలో చింతపండుతో కంచు, రాగి పాత్రల్ని శుభ్రం చేయడానికి మెరుపు తేవడానికి వాడతారు.
చింతపిక్కలను బిస్కెట్‌లుగానూ, గారెలుగానూ తయారుచేస్తారు.
చింతకాండం దృఢంగా ఉండడం వల్ల, కలపగా ఇంటిసామాన్లు తయారీలో వాడతారు.
చింత కొమ్మలను బొగ్గుగా చేసి, చిత్రలేఖనంలో ఉపయోగిస్తారు.
చింత కర్ర బొగ్గుగా కాల్చి, ఆ బొగ్గుల పొడిలో ఉప్పు, పిప్పర్‌మెంట్ పువ్వు కలిపి, పళ్లపొడి తయారుచేస్తారు.
చింత ఉత్పత్తులను సౌందర్య సాధనాల్లోనూ ఉపయోగిస్తారు.
చింత ఆకుల్ని మేకలు, పశువులు ఇష్టంగా మేస్తాయి. పచ్చిరొట్ట ఎరువుగానూ వీటిని వాడుకుంటారు. లేత చింతచెట్ల నుంచి ఆఫ్రికాలో ఓ రకమైన నార తీస్తారు.
చింతపూలు చక్కటి బంగారురంగు తేనెనిస్తాయి. అయితే ఆ పూలలోని సహజమైన పుల్లదనం కారణంగా ఆ తేనె కూడా రవ్వంత పులుపుగా ఉంటుంది.
చింత ఆకుల నుంచి తీసే ఎరుపు, పసుపుల మిశ్రమపు రంగును అద్దకపు పరిశ్రమలో వాడతారు.
చింతపండును, చింత గింజల్ని, చింత గింజల పొడిని కూడా విదేశాలకు ఎగుమతి చేస్తారు.
దృఢమైన ఈ కలపను స్థానికులు వ్యవసాయ పనిముట్ల తయారీకి వాడుకుంటారు.
చింత విత్తనాల్లోని తెల్లటిపప్పు నుంచి తీసే నూనెను దీపాలు వెలిగించడానికీ, పెయింట్లు, వార్నిష్‌ల తయారీలోనూ వాడతారు.
మరుగుజ్జు చింత వృక్షాల(బోన్సారు)ను గృహాలంకరణగా వినియోగిస్తున్నారు.
వంటకాలు...

దక్షిణ భారతదేశీయుల ఆహారంలో ఇది ముఖ్యమైన భాగం. రసం, సాంబారు, రకరకాల పులుసులు, నిల్వపచ్చళ్లలో పులుపు వేయాలంటే చింతపండు గుజ్జు వేస్తారు. లేత చింతకాయలతో చట్నీ, వాటి గుజ్జును పప్పులో కలుపుతారు. ముదిరిన కాయలతో నిల్వ పచ్చడి చేస్తారు. లేత చింత ఆకులను చింతచిగురు అంటారు. దీన్ని ఆకుకూరగా వాడతారు. చింతచిగురును నీడలో ఎండబెట్టి, పొడిని తయారుచేస్తారు. చింతపువ్వులను కందిపప్పుతో కలిపి పొడికూర చేస్తారు. చింతపండు గుజ్జు/ చింతచిగురుతో పులిహోర మహా రుచిగా ఉంటుంది.
ఫిలిప్పైన్స్‌లో చింతాకు టీని మలేరియా జ్వరానికి ఉపశమనంగా వాడతారు.
ఈజిప్టులో చింతపండు రసం చల్లని పానీయంగా సేవిస్తారు.
థాయిలాండ్‌లో తియ్యని రకం చింతపండును ఇష్టంగా తింటారు.
లేత చింత చిగురును ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు. కొన్ని రకాల పచ్చళ్లు, పొడులు తయారుచేస్తారు.
వైద్యపరమైన ఉపయోగాలు..

100 గ్రాముల చింతపండు 283 కేలరీల శక్తి ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ గుణాలు కలిగున్న చింతపండు ఆయుర్వేద పరంగా.. పులితేనుపులు అరికట్టడానికి, కడుపు ఉబ్బరానికి, జ్వరం, వికారం మొదలైన రోగాలకి మందులా పనిచేస్తుంది.
ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి, అదే క్రమంలో మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది.
రక్తహీనతతో బాధపడుతున్నవారు చింత ఉత్పత్తులు తీసుకోవడం వల్ల చక్కని ఫలితాలు పొందవచ్చు. ఇవి శరీరంలో ఎర్ర రక్తకణాల పెరుగుదలను పెంచడంతో పాటు.. మలినాలు చేరిన రక్తాన్ని ఫిల్టర్ చేసి, శుభ్రపరుస్తుంది.
ఆకలి మందగించినవారు ఉదయాన్నే 4-5 చెంచాల చింతపండు రసాన్ని తాగితే, ఆకలి పుడుతుంది.
శరీరంలోని వాపులకి, నొప్పులకి చింతపండు రసంలో ఉప్పు కలిపి పట్టీలా వేయడం, మసాజ్ చేస్తే మంచి ఉపశమనం ఉంటుంది.
అజీర్ణ రోగాలకి, జీర్ణశక్తిని పెంచడానికి చింతపండు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
మధుమేహ సమస్య కూడా చింతను తీసుకోవడం వల్ల క్రమబద్ధమవుతుంది.
పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు ఉన్నాయి.
మూత్రకోశ వ్యాధులు, మూత్రపిండాల్లో రాళ్లు, కీళ్ల నొప్పులు, గుండె జబ్బులకు ఉపశమనాన్ని ఇస్తుంది.
తరచూ చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి.
థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు చింత చిగురును తమ ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
చింతగింజల్లో మన ఆరోగ్యానికి అవసరమైన ప్రొటీన్స్, ఎమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. చింత గింజలు అనేకరకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నివారిస్తాయి. చింత గింజల పొడిని పాలు లేదా నీళ్లలో కలిపి, తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
చింతచిగురు కొబ్బరిపాలలో కలిపి, బాగా నూరాలి. దీనికి పసుపు, పచ్చకర్పూరాన్ని కలపాలి. ఈ పేస్టు ముఖంపై మొటిమలు, మచ్చలకు బాగా పనిచేస్తుంది.
వైద్య పరంగా దీనికి ఉన్న ప్రాముఖ్యత వల్ల ఆయుర్వేదం మొదలైన వైద్యవిధానాల్లో ప్రముఖస్థానాన్ని ఆక్రమించిందంటే ఆశ్చర్యం ఏమీ లేదు
చరిత్ర..

ఈ మొక్క భారతీయం కాదని, బయటి నుంచి వచ్చిందని డి.బ్రాండిస్ అనే వృక్ష శాస్త్రవేత్త 1906లో చెప్పారు. తర్వాత కెవొరికీ అనే మరొక వృక్ష శాస్త్రవేత్త ఈ మొక్కని భారతదేశంతో పాటు బర్మాకి చాలాకాలం కిందట అరబ్ వర్తకులు పరిచయం చేశారని రాశారు. అయితే, వాస్తవానికి అరేబియా దేశాలలో ఇది పెరగదు. మరి వారికెలా వచ్చిందనే ప్రశ్న వచ్చింది. దీనికి ఆయనేం చెప్పారంటే, అరేబియన్ వర్తకులు రెండు రకాలు. ఒకరేమో భూ మార్గంలో వచ్చేవాళ్లు, రెండో వాళ్లు సముద్ర మార్గంలో వచ్చేవాళ్లు. సముద్రం ద్వారా వచ్చేవాళ్లు ఆఫ్రికన్ ఆహారాన్ని తీసుకొచ్చి, భారతదేశంలో వదిలారనేది ఒక కథనం. మరో కథనం ప్రకారం.. అరబ్బుల కంటే ముందు ఇథియోపియన్ వ్యాపారులు మనదేశంలో వర్తకం చేసేవారు. చాలాకాలం చెడిపోకుండా ఉండే స్వభావం ఉన్నందున వారు ఆహారంగా దీనిని సముద్ర ప్రయాణంలో తీసుకుని వెళ్లేవాళ్లు. అలా వారి ద్వారా ఇది ఆఫ్రికా నుంచి మనదేశానికి వచ్చి, ఉండవచ్చని కొంత మంది పరిశోధకులు చెబుతున్నారని ఎన్‌సిషా తన 'ఆసియా అగ్రీ హిస్టరీ'లో ప్రస్తావించారు. అయితే చరక సంహితలో 'ఆమ్ల'గా వర్ణించిది పండు చింతయేనని చెబుతారు. ఆయుర్వేద గ్రంథం చరక సంహిత క్రీ. శ 123-150 నాటిది. ఇలాగే అమరకోశంలో కూడా 'తింతిడి, చింకా, అమ్లికా' అనే పేర్లతో చింత ప్రస్తావన ఉంది.
చింత సాగు..
చింతపండుతో దక్షిణాది ప్రజలకు, రైతులకు విడదీయరాని అనుబంధం ఉంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో చింత సాగు జరుగుతోంది. తీవ్ర కరువు, గాలివానలు వంటి ప్రకృతి వైపరీత్యాలను సైతం తట్టుకోవడంతోపాటు రైతుకు స్థిరంగా ఏటేటా మంచి ఆదాయాన్ని ఇవ్వగలిగిన మంచి తోట చింత. ఆంధ్రప్రదేశ్‌లో చింతపండుని మొత్తం సుమారు 6,099 హెక్టార్లలో సాగు చేయగా.. 46,962 టన్నులు వార్షిక ఉత్పత్తి లభిస్తుంది. ప్రస్తుతం చింతచెట్టుని ఆగేయాసియా, ఆస్ట్రేలియా, అమెరికా అంతటా సాగు చేస్తున్నారు. కాగా భారతదేశం ఏటా సుమారు 2.5 లక్షల టన్నుల చింతపండు గుజ్జును ఉత్పత్తి చేస్తుంది. పల్ప్, పౌడర్, జ్యూస్‌లను యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
సినిమా పాటలు..

'చింత చిగురు పులుపనీ.. చీకటంటే నలుపనీ..
చెప్పందే.. తెలియని చిన్నపిల్ల..
అది చెరువులో పెరుగుతున్న చేపపిల్ల..
అభం శుభం తెలియని పిచ్చిపిల్ల...'
అంటూ 'ఓ సీత కథ' సినిమాలో..
'చింతచెట్టు చిగురు చూడు..
చిన్నదాని పొగరు చూడు..
చింతచిగురు
పుల్లగున్నాదోరు..
నా సామిరంగ.. చిన్నదేమో తియ్యగున్నాదోరు..'
అంటూ 'అదృష్టవంతులు' సినిమాలోనూ...
'చింత చిగురు చిన్నదానా..
చేప వగరు వలపుదాన..
రాయే నా చెంత చేర...'
అంటూ 'బహుదూరపు బాటసారి' సినిమాలోనూ..
'చింత చెట్టు నీడ..
చల్లంగున్నది ఈడ..
నీ మీద పాణం ఆగదాయే ఏడా..
నేనేమో.. బావా నేనేమో ఇక్కడ..
మనసేమో అక్కడ...'
అంటూ వచ్చిన జానపద గీతం.. సంగీత ప్రియులను అలరిస్తున్నాయి..
గ్రామాలు, ఇంటి పేర్లు..

'చింతల', 'చింతా', 'చింతకాయల', 'చింతకింది' మొదలైన తెలుగువాళ్ల ఇళ్లపేర్లు.. 'చింతపల్లి, చింతలపూడి, చింతకాని, చింతమోటు, చింతల్లంక, రెంటచింతల, ముచ్చింతల, చింతూరు, చింతకొమ్మ దిన్నె' మొదలైన తెలుగు గ్రామ నామాలు చింతకూ తెలుగువారికీ అనాదిగా ఉన్న అనుబంధానికి ప్రతీకలుగా చెప్పుకోవచ్చు.
చిన్నారుల చిరుతిండిగా..

మనదేశంలో ఈ మొక్క చాలా సాంఘిక ప్రయోజనాలు నిర్వర్తించింది. షేర్ షా సూచి (1540-45) పాతరోడ్లను పునరుద్ధరిస్తున్న సమయంలో, ముఖ్యంగా పెషావర్ నుంచి కోల్‌కతా వరకూ ఉన్న రోడ్డును పునరుద్ధరిస్తున్నపుడు బాటసారులు విశ్రాంతి తీసుకునేందుకు రోడ్డుకు ఇరువైపులా చింతచెట్లను నాటించారు. అపుడు చింతపండు చిరుతిండిగా వాడేవారు. అయితే రాను రాను.. ఇది పిల్లల చిరుతిండిగా మారింది. పూర్వకాలంలో పెద్దలు.. పిల్లలకు డబ్బులు ఎక్కువ ఇచ్చేవారు కాదు. దాంతో పిల్లలు ప్రకృతి సహజంగా దొరికే పండ్లు, కాయలు ఎక్కువగా తినేవారు. అందులో బాగా చెప్పుకోవాల్సింది.. చింతకాయలు, చింతపువ్వు. చింత తొక్కు, చింతపువ్వులో ఉప్పు, కారం కలిపి పిల్లలు ఎంతో ఇష్టంగా తినేవారు. చింతపప్పును కొందరు పెద్దలు బియ్యంతో కలిపి నేతిలో వేయించి, దంచి పొడి చేసి, దానికి పంచదార, నెయ్యి చేర్చి, రవ్వ లడ్డూలా చేసి, పెట్టేవారు. పిల్లలూ ఇష్టంగా తినేవారు.
ఉదయ శంకర్ ఆకుల
79897 26815