
ఓ రామచిలుక ఒక చెట్టు పై నుండి ఎగురుతూ దానికి ఉన్న దారపు పోగులకు చిక్కుబడి, కాళ్లకు గాయం చేసుకొని కింద పడిపోయింది. తన కొట్టు దగ్గరే పడిందని ఆ కదల్లేని రామచిలుకను ఆ కొట్టు యజమాని రమణయ్య దగ్గరకు తీసుకొని, గాయపడిందని తెలుసుకొని దానికి దయాగుణంతో కట్టు కట్టాడు. అప్పుడూ ఎగర్లేదు కాబట్టి ఓ వెదురు పంజరంలో రక్షణ కల్పించాడు రమణయ్య. ఆ చిలుకకూ అందులో భద్రతగా అనిపించింది. సరే, ఆ తర్వాత రమణయ్య తన కొట్టును యథావిధిగా నడిపించసాగాడు. ఆ చిలుకను చూడడం కోసం చిన్నారులూ వచ్చేవారు. దాంతో గిరాకీ కూడా బాగా జరిగేది. అయితే రామయ్య కొట్టే రమణయ్య కొట్టు కంటే బాగా నడుస్తుండేది. రామయ్య కొట్టు రమణయ్య కొట్టంత పాతదేం కాదు, ఇంకా ఆ కొట్టుకు ఈ కొట్టుకు మధ్య దూరం వందమీటర్ల కంటే తక్కువే వుండేది. కానీ రామయ్య పెట్టిన తర్వాత కొట్టు గిరాకీ అటే పోవడం రమణయ్య గమనించాడు. ఆ రామచిలుక రెండు రోజులు జాగ్రత్తగా రమణయ్య కొట్టు తీరు తెన్నులు పరిశీలించసాగింది. ఆ చిలుకకు ఓ విషయం అర్థమైంది. రమణయ్య, కొట్టుకు వచ్చిన వాళ్ళతో పరుషంగా వ్యవహరిస్తాడని. అంటే డబ్బులు రేపు ఇస్తానంటే 'అస్సలే సరుకులివ్వడం కుదరదు' అని చెప్పడం. కాస్త పెద్ద నోటు ఇస్తే 'ససేమిరా చిన్న నోట్లు తీసుకొస్తేనే సరుకులిస్తా' అనడంలాంటివి. కాస్తంతయినా గిరాకీ పట్ల సౌమనస్యం, చిరునవ్వు ప్రదర్శించకపోవడం. మరో రెండురోజుల తర్వాత చిలుక గాయం నుండి కోలుకుంది. 'రామ చిలుకా, ఇప్పుడు నువ్వెగరవచ్చు, మీ కుటుంబ సభ్యులు నీ కోసం ఎదురుచూస్తుంటారు, త్వరగా వెళ్ళు' అన్నాడు రమణయ్య పంజరాన్నుండి తప్పిస్తూ.
'రమణయ్యగారూ, నాలాంటి అల్పప్రాణికి మీరు ప్రాణదానం చేశారు. మీ మేలు మరువలేను. కాకపోతే ఒక మాట. మీ కొట్టు రామయ్య కొట్టుకంటే గిరాకీ బాగా చేయట్లేదని మీ భార్యకు చెప్పి వాపోవడం నేను గమనించాను. మీరు మీ గిరాకీ పట్ల కాస్తంత సౌమనస్యాన్ని చూపండి. సానుభూతితో వ్యవహరించండి. మీ కొట్టు గిరాకీ బావుంటుంది' అని ఆ చిలుక తుర్రున ఎగిరిపోయింది. రమణయ్య ఆ చిలుక చెప్పినట్టు, గిరాకీతో చీకూ చికాకుతో కనపడకుండా, ఆ రోజు నుండే మంచితనంగా వ్యవహరించాడు. ఆ పరిణామం వల్ల రమణయ్య కొట్టు దినదినాభివద్ధి చెందసాగింది.
డా చిట్యాల రవీందర్, 7798891795