Aug 30,2023 20:04

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌

ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేషన్‌
టిడిపి కార్పొరేటర్లు చిల్లర రాజకీయాలు మాని హుందాగా వ్యవహరించాలని, కుల, మత, రాజకీయాలకతీతంగా నగరంలో అభివృద్ధి పనులు చేస్తున్నామని మేయర్‌ బివై.రామయ్య తెలిపారు. బుధవారం కర్నూలు నగరంలోని ఎస్‌బిఐ కాలనీలో ఉన్న కొత్త కౌన్సిల్‌ హాలులో కర్నూలు నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. మేయర్‌ రామయ్య అధ్యక్షత వహించారు. ముందుగా కౌన్సిల్‌లో ఉన్న మహిళలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నగరాభివృద్ధి, పరిపాలనకు సంబంధించిన 60 అంశాలపై అజెండాను కౌన్సిల్‌లో చదివి చర్చించి ఆమోదించారు.
తాగునీరు కల్తీ కాకుండా చూడాలి
- పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

పాణ్యం పరిధిలో 26, 27వ వార్డుల్లో తాగునీరు కల్తీ అయి దుర్వాసన వస్తోంది. కలుషితం కాకుండా చూడాలి. శ్మశానానికి ప్రహరీ ఏర్పాటు చేయాలి. విఠల్‌ నగర్‌ నుంచి హంద్రీ మీదుగా కల్లూరు దర్వాజా వరకు వీధిలైట్లు వేయాలి. నగరంలో 17 ఒహెచ్‌ఆర్‌ ట్యాంకులు, కర్నూలు నగర జనాభాకు అనుగుణంగా అమృత్‌-2 కింద రూ.132 కోట్లతో 17 ఎంఎల్‌డి సామర్థ్యంతో ఫిల్టర్‌ బెడ్లను నిర్మించి తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నాం. వీకర్‌ సెక్షన్‌ కాలనీలో డ్రెయినేజీ కాలువల్లో పైపులైన్లు ఉన్నాయి. వాటిని వేరు చేసి తాగునీరు కలుషితం కాకుండా చూడాలి. హంద్రీనదిని రూ.1.5 కోట్లతో శుభ్రం చేశాం. ఎప్పటికప్పుడు పిచ్చి మొక్కలు, కంపచెట్లు తొలగిస్తున్నాం. ఇతర ఏ కార్పొరేషన్‌లో చెత్త పన్ను ఇంత లేదని, చెత్త పన్నును స్లమ్‌ ఏరియాల్లో రూ.30, కమర్షియల్‌ ఏరియాల్లో రూ.60 చొప్పున వసూలు చేసే విధంగా తీర్మానం చేయాలి. కొత్తగా నగరంలో విలీనమైన స్టాంటన్‌పురం, మావిదాలపాడు, మునగాలపాడు గ్రామాల ప్రజలకు ఒక్కసారిగా పన్నుల భారం వేయకుండా తగ్గించాలి.
కులమతాలు, పార్టీలకతీతంగా అభివృద్ధి
- కర్నూలు ఎమ్మెల్యే ఎం ఎ హాఫీస్‌ ఖాన్‌.

నగరంలో కులమతాలు, రాజకీయాలకతీతంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నాం. ఎవరికి ఏ పనులు కావాలన్నా వివక్ష చూడకుండా సమస్యలను రాసి ఇస్తే అభివృద్ధి చేస్తాం. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తున్నా టిడిపి కార్పొరేటర్లు దురుసుగా వ్యవహరిస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడటం సంస్కారం కాదు. కర్నూలు నగరానికి గుర్తుగా ఉన్న కొండారెడ్డి బురుజు ప్రతిష్టను వేనోళ్ల పొగిడేలా అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించి సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తుంగభద్ర, హంద్రీనదుల పరివాహక ప్రదేశాల బండ్‌ రోడ్డును పూర్తి చేస్తే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది. కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం 150 క్యూసెక్కుల నీటిని సుంకేసుల రిజర్వాయర్‌ నుంచి నగరానికి చేర్చే క్రమంలో మధ్యలో జలచౌర్యం జరిగి, కొంత నీరు ఆవిరై కేవలం 50 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరుతోంది. నీరు వృథా కాకుండా పైపులైన్‌ ద్వారా నగరానికి తీసుకొచ్చే ప్రాజెక్టును పూర్తి చేయాలి. గతంలో అమృత్‌ పథకం కింద ఉచితంగా కుళాయి కనెక్షన్లు ఇచ్చి మోసం చేశారు. ప్రస్తుతం డబ్బులు చెల్లించాలని చెప్పడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
నీటిని పొదుపుగా వాడుకోవాలి
- కమిషనర్‌ భార్గవ్‌ తేజ

వర్షాభావ పరిస్థితుల వల్ల నదుల్లో నీరు సమృద్ధిగా లేదు. కర్నూలు నగర ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఏ వార్డులో, ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తాం.
తాగునీటి సమస్యను పరిష్కరించాలి
- డిప్యూటీ మేయర్‌ సిద్ధారెడ్డి రేణుక

రాజీవ్‌ గృహకల్ప, వాసవీ నగర్‌, గీతానగర్‌లో వేసవిలోనే కాదు... ప్రస్తుతం కూడా నీటి సమస్య ఉంది. తాగునీటి సమస్యను పరిష్కరించాలి.
అజెండాలో ఉన్న అంశాలపై కార్పొరేటర్లు మాట్లాడుతూ... నగరంలో అత్యవసర పనుల కింద కేటాయించిన నిధులు నామినేషన్‌ వర్కులు సి బిల్లులు చేసి తీసుకొని మళ్లీ బిల్లులు చేస్తున్నారని విమర్శించారు. డిప్యూటీ మేయర్‌ నాయకల్లు అరుణ, అదనపు కమిషనర్‌ పివి.రామలింగేశ్వర్‌, సిటీ ప్లానర్‌ మీనా కుమారి, డిసిపి మోహన్‌ కుమార్‌, ఎస్‌ఇ వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

 సమావేశంలో మాట్లాడుతున్న కాటసాని
 సమావేశంలో మాట్లాడుతున్న కాటసాని