May 29,2021 07:43

   ముఖ్యంగా పెట్టుబడిదారులకు, ఇతర దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉన్న ప్రస్తుత రాజకీయ వ్యవస్థను మొత్తంగా సంస్కరిం చాలని, మానవ హక్కులను హరించేందుకు ఎలాంటి అవకాశం లేని, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కావాలని కోరుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మెరుగైన భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే రాజ్యాంగం కావాలని వారు కోరుకుంటున్నారు. ఆ ఉద్దేశంతోనే యువ సభ్యులను ఎక్కువగా ఎన్నుకోవడం జరిగింది.
   2021 మే16 చిలీకి ఒక చారిత్రాత్మక రోజు. 155 స్థానాలతో కూడిన రాజ్యాంగ పరిషత్‌కు చిలీ ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకున్న రోజు. నూతన రాజ్యాంగ రచనకు ఉద్దేశించిన రాజ్యాంగ పరిషత్‌కు జరిగిన ఎన్నికల్లో 43 శాతం మంది చిలీ ప్రజలు (64 లక్షల మంది) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్యాంగ పరిషత్‌తో బాటు 16 గవర్నర్లు, 345 మేయర్ల, 2,252 కౌన్సిలర్ల స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో మితవాద శక్తులను చిత్తుగా ఓడిస్తూ ప్రజలిచ్చిన తీర్పు చారిత్రికంగా ఎనలేని ప్రాధాన్యత కలిగి ఉన్నది.
   155 స్థానాలున్న రాజ్యాంగ పరిషత్తులో ఏ రాజకీయ పార్టీకి చెందని వారు 65 స్థానాలు గెలుచుకున్నారు. కీలకమైన విషయం ఏమిటంటే వీరంతా నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారు. చిలీ కమ్యూనిస్టు పార్టీ 'అప్రూబో డిగ్నిడాడ్‌ ఆధ్వర్యంలో ఇతర లెఫ్ట్‌ పార్టీలు, శక్తులతో కూడిన కూటమి 28 సీట్లు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. మధ్యేవాద, లెఫ్ట్‌ కూటమి అప్రూబో 24 సీట్లు సాధించింది. మొత్తం మీద నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన శక్తులన్నీ కలసి 117 స్థానాలు గెలుచుకున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు పినేరా నేతృత్వంలోని పార్టీ అతి కష్టం మీద 37 స్థానాలు గెలుచుకుంది. మేయర్‌, గవర్నర్ల ఎన్నికల్లోనూ మితవాద అభ్యర్థులకు ఇదే పరిస్థితి ఎదురైంది. చాలా రాష్ట్రాలు, పట్టణాల్లో మితవాద అభ్యర్థులు ఓడిపోయారు.
    చిలీ రాజధాని శాంటియాగో మేయర్‌గా కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి ఇరాసి హేస్లర్‌ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు వాస్తవానికి ఏప్రిల్‌లో జరగాల్సివుంది. కోవిడ్‌ మహమ్మారి ఉధృతంగా వుండడంతో మే నెలకి వాయిదావేశారు. కొత్తగా ఎన్నికైన రాజ్యాంగ పరిషత్‌ నూతన రాజ్యాంగ రచన ఏడాదిలోగా పూర్తి చేయాలని గడువు విధించారు. రాజ్యాంగ పరిషత్‌ రాజ్యాంగ ముసాయిదాను రూపొందించాక, ప్రజల ఆమోదం కోసం దానిని రిఫరెండమ్‌కు పెడతారు.
 

                                                             నేపథ్యం క్లుప్తంగా ...

   రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికలు జరపాలన్న డిమాండ్‌ 2019లో ఉవ్వెత్తున ఎగసిన పోరాటం నుంచి వచ్చింది. మెట్రో ఛార్జీలను 30 శాతం మేర పెంచుతూ పినేరా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు ప్రారంభించిన నిరసనలకు అన్ని తరగతుల ప్రజానీకం నుంచి మద్దతు లభించడంతో అనతి కాలంలోనే అది ఒక మహోద్యమంగా మారింది. మొదట ఈ నిరసనలను బలప్రయోగం ద్వారా అణచివేయవచ్చని ప్రభుత్వం భావించింది. నియంతృత్వ అనంతర చిలీ చరిత్రలో మొదటి సారి ఎమర్జెన్సీని విధించింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు మిలిటరీని దింపింది. శక్తివంతమైన శత్రువులకు వ్యతిరేకంగా రాజ్యం ప్రకటించిన యుద్ధం ఇది అని అధ్యక్షుడు పినేరా ప్రకటించారు. నిరసనకారులను 'గూండాలు', 'నేరగాళ్ళు', 'అలగా జనం' అంటూ నిందించారు. ఎన్నడూలేని విధంగా క్రూరమైన అకృత్యాలకు సాయుధ దళాలు తెగబడ్డాయి. పిల్లలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సాయుధ దళాలు పేల్చిన పెలెట్లు కళ్లల్లోకి దూసుకుపోయి చాలా మంది చూపు కోల్పోయారు. నిరసనల సందర్భంగా మహిళలపై అత్యాచారాలకు అంతులేకుండా పోయింది. ఈ నిరసనల్లోకి కార్మిక వర్గం కూడా రావడంతో పోరాటం కొత్త రూపం సంతరించుకుంది. భారీ నిరసనల ధాటికి ప్రభుత్వం వెనక్కి తగ్గి మెట్రో ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోక తప్పలేదు. హుందాగా జీవించడం, గౌరవం, మహిళలకు సమానత్వం, మెరుగైన వేతనం, స్థిరమైన ఉపాధి, విద్య, ఆరోగ్య సదుపాయాలు ఇతర సామాజిక ప్రయోజనాలు పెంచాలని నిరసనకారులు గట్టిగా గొంతెత్తారు ఈ ఉద్యమ సెగకు ప్రభుత్వం మరోసారి దిగొచ్చి డిమారడ్లన్నిటిని కాకున్నా కార్మికులకు, ఇతరులకు కొన్ని సంక్షేమ చర్యలు చేపట్టింది.
   దీంతో ప్రజల ఆలోచనల్లో మరింత పరిపక్వత వచ్చింది. ప్రభుత్వాలు పదేపదే చేపడుతున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు, నిరసనకారులపై అవి సాగిస్తున్న కిరాతక దాడులకు కారణం ఈ వ్యవస్థేనని వారు గ్రహించారు. ఆ విధంగా నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు స్వస్తి పలకాలన్న డిమాండ్‌ ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే నియంత పినోచెట్‌ కాలం నాటి రాజ్యాంగాన్ని తిరగ రాయాలన్న డిమాండ్‌ ముందుకొచ్చింది. ఇది యాదృచ్ఛికంగా వచ్చిన డిమాండ్‌ కాదు. అంతకు ముందు దీనిపై ప్రజల్లో అనేక చర్చలు, వాదోపవాదాలు జరిగాయి. జనం వీధుల్లోకి వచ్చి కృతనిశ్చయంతో పోరాడారు. దీంతో వారిలో భయంతోపాటు ఊగిసలాట ధోరణులన్నీ పోయాయి. తెగించి పోరాడేతత్వం అలవడింది. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలకు గురి చేసినా లెక్క చేయకుండా మొక్కవోని దీక్షతో వారు ముందుకు సాగారు.ఉద్యమం మరో మెట్టు పైకెళ్ళింది. రాజ్యాంగ పరిషత్‌ ఏర్పాటు అంశంపై ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పోరాటంగా రూపుదాల్చింది. ప్రభుత్వం ప్రస్తుత జాతీయ అసెంబ్లీ సభ్యులే రాజ్యాంగ రచన చేపడతారని చెప్పగా, ప్రజలు అందుకు ససేమిరా అన్నారు. రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నుకునే ప్రతి నిధుల ద్వారానే నూతన రాజ్యాంగ రచన జరగాలని పట్టుబట్టారు. ఈ విషయాన్ని రిఫరెండమ్‌ ద్వారా నిర్ణయించాలన్నారు. ప్రభుత్వం దీనికి అనివార్యంగా అంగీకరించాల్సి వచ్చింది. నూతన రాజ్యాంగాన్ని రూపొందిం చే బాధ్యత ఎన్నికైన రాజ్యాంగ పరిషత్‌కే అప్పగించాలన్న దానికి ప్రజల నుంచి అపూర్వమైన మద్దతు లభించింది.
 

                                                     నూతన రాజ్యాంగం ఎందుకు ?

   పినోచెట్‌ కాలం నాటి రాజ్యాంగం నయా ఉదారవాద ఆర్థిక విధానం నమూనా ప్రాతిపదికన రూపుదిద్దుకున్నది. మార్కెట్‌ శక్తులపై నియంత్రణ తొలగింపు, సామాజిక భద్రత ప్రైవేటీకరణకు ఇది బాటలు వేసింది. విద్య, ఆరోగ్య భద్రత, పింఛన్లు వంటివాటికి అది ఎలాంటి గ్యారెంటీ ఇవ్వలేదు. మహిళలకు సమానత్వ హక్కు, వివాహాల్లో సమానత్వం, చట్టబద్ధమైన, సురక్షిత గర్భస్రావాలకు ఎలాంటి హామీ లేకుండాపోయింది. ఈ రాజ్యాంగం సామాన్య పౌరుల హక్కుల కన్నా పెట్టుబడిదారులు, బడా వ్యాపారులకే ఎక్కువ అనుకూలమైనది. మరీ ముఖ్యంగా ఈ దేశంలో మూలవాసీ తెగలకు చెందినవారు తగినంత సంఖ్యలో వున్నారు. వారికి ఈ రాజ్యాంగంలో ఎటువంటి రక్షణలు కానీ, హక్కులు కానీ లేవు.
   రాజ్యాంగంలోని నిబంధనలను ఆసరాగా చేసుకుని పాలక వర్గాలు తమ దోపిడీని యథేచ్ఛగా సాగించాయి. ఫలితంగా ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరిగిపోయాయి. కొద్ది మంది శతకోటీశ్వరులు వద్ద దేశ జిడిపి లో నాల్గో వంతు పోగుపడింది. మరోవైపు నిరుద్యోగిత రేటు అసాధారణ స్థాయిలో 55 శాతానికి చేరింది. ఉపాధి పొందుతున్న వారిలో సైతం చాలా మందికి సామాజిక భద్రత అందని ద్రాక్షగానే మిగిలింది. 30 శాతం దాకా కాంట్రాక్ట్‌, లేదా 10 మాసాల కన్నా తక్కువ నిడివితో కూడిన స్వల్పకాలిక ఉద్యోగాలే. 50 శాతం మంది వర్కర్లకు పొదుపు చేసుకునేందుకు, కనీస ఫించనుకు అవసరమైన మొత్తాన్ని దాచుకునే స్తోమత కానీ లేదు. అధిక ఫీజుల కారణంగా ఆరోగ్య భద్రతకు చాలా మంది దూరమయ్యారు.
2008 ఆర్థిక సంక్షోభం ప్రజలపై మరిన్ని భారాలు మోపింది. దీంతో ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి భగ్గుమంది. అదే 2019లో నిరసనలకు ప్రేరణనిచ్చింది. కోవిడ్‌ను అదుపు చేయడంలో ప్రభుత్వ వైఫల్యం దీనికి మరింత ఆజ్యం పోసింది. 2019లో మొదలైన నిరసనలు కరోనా విపత్తు సమయంలోనూ కొనసాగడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం. రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికలు జరపాలన్న డిమాండ్‌ నెరవేరేంత వరకు ఉద్యమం కొనసాగింది. దాని ఫలితంగా ఇప్పుడీ ఎన్నికలు జరిగాయి.
 

                                                     రాజ్యాంగ పరిషత్‌లో పొందికలు

   నూతనంగా ఎన్నికైన రాజ్యాంగ పరిషత్‌లో పైన పేర్కొన్నట్లు లెఫ్ట్‌, నయా ఉదారవాద వ్యతిరేక శక్తులు గట్టి పట్టు సాధించాయి. మితవాద ప్రతినిధులు రాజ్యాంగ పరిషత్‌ మొత్తం సభ్యుల్లో నాలుగో వంతు కన్నా తక్కువే ఉన్నారు. రాజ్యాంగ ముసాయిదాలో ఏదైనా ప్రతిపాదన చేర్చాలంటే మూడింట ఒక వంతు మెజార్టీ అవసరం. మితవాద ప్రతినిధులకు మూడింట ఒక వంతు కన్నా తక్కువ బలం వున్నందున కొత్త రాజ్యాంగంలో ప్రగతిశీల నిబంధనలను చేర్చకుండా అడ్డుకునే శక్తిని వారు కోల్పోయారు.
   ఎన్నికలకు ముందు మహిళలకు సమాన ప్రాతినిద్యం, దేశీయంగా వున్న మూలవాసీ తెగలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతం మూలవాసీ తెగలకు రాజ్యాంగ పరిషత్‌లో 17 శాతం సీట్లు కేటాయించారు. ఈ రిజర్వుడ్‌ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా రావడంతో కొత్త రాజ్యాంగ పరిషత్‌లో మొత్తం 79 మంది మహిళా సభ్యులు ఉండగా, పురుషులు 76 మందే ఉన్నారు. రాజ్యంగ పరిషత్‌ లో పురుషులపై మహిళలు తొలిసారి పై చేయి సాధించారు. ఇది మరో చారిత్రాత్మక విషయం.
మరో ఆసక్తికరమైన విషయమేమంటే రాజ్యాంగ పరిషత్‌కు ఎన్నికైన సభ్యుల సగటు వయసు 45 సంవత్సరాలు. రాజ్యాంగ ముసాయిదాలో యువత ముఖ్యమైన పాత్ర పోషించనుందనడానికి ఇదొక సంకేతం.
    ఎన్నికైన ప్రతినిధుల మనోగతాలను తెలుసుకునేందుకు చిలీ లోని మీడియా సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించగా మరి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అధ్యక్షుని అధికారాలను కుదించాలని 86.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఏక సభతో కూడిన పార్లమెంటుకు 51 శాతం మంది మద్దతు తెలిపారు. రాజ్యాంగ న్యాయస్థానంలో సంస్కరణలు తీసుకురావాలన్న ప్రతిపాదనతో 65 శాతం మంది ఏకీభవించారు. నీరు అందరికీ అందుబాటులో ఉండేలా చూడడం, నీటివనరుల పరిరక్షణ, పంపిణీని పౌరుల ప్రాథమిక హక్కుగా, జాతీయ ప్రజా వనరుగా పరిగణించి రాజ్యాంగంలో వీటిని పొందుపరచాలని 91.6 శాతం మంది కోరుకుంటున్నారు. అందరికీ మంచి ఆవాసం కల్పించేందుకు రాజ్యాంగం పూచీ పడాలని 69 శాతం మంది పేర్కొన్నారు. స్త్రీలకు పురుషులతో సమంగా వేతనాలు ఉండాలని, చిలీని బహుళత్వంతో కూడిన దేశంగా ప్రకటించాలని 73 శాతం మంది పేర్కొన్నారు.
 

                                                      చిలీ ప్రజల ఆశలు, ఆకాంక్షలు

   ఎన్నికైన ప్రతినిధులు నూతన రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు నయా ఉదారవాద విధానాలపై తమ ఆగ్రహాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని చిలీ ప్రజలు కోరుకుంటున్నారు. విద్య, ఆరోగ్య సదుపాయాలకు రాజ్యం గ్యారంటీ ఇచ్చేలా రాజ్యాంగం చూస్తుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు సమానత్వ హక్కు, గర్భస్రావ హక్కు, హుందాగా జీవించే హక్కు, సమాన పనికి సమాన వేతన హక్కు, వేతనాలను నిర్దిష్ట కాలావధిలో ఎప్పటికప్పుడు సవరించే హక్కు, శ్రమ జీవులకు సామాజిక భద్రత హక్కు మున్నగువాటికి కొత్త రాజ్యాంగం పూచీ పడుతుందన్న ఆశతో ప్రజలు ఉన్నారు. ఈ అంశాలతో బాటు చిలీ సమాజం బహుళత్వ స్వభావాన్ని, మూలవాసులను గుర్తించి, వారి హక్కులకు గ్యారంటీ ఇచ్చే పని కూడా కొత్త రాజ్యాంగం చేయాలని వారు కోరుకుంటున్నారు.
   అంతకన్నా ముఖ్యంగా పెట్టుబడిదారులకు, ఇతర దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉన్న ప్రస్తుత రాజకీయ వ్యవస్థను మొత్తంగా సంస్కరించాలని, మానవ హక్కులను హరించేందుకు ఎలాంటి అవకాశం లేని, ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కావాలని కోరుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మెరుగైన భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే రాజ్యాంగం కావాలని వారు కోరుకుంటున్నారు. ఆ ఉద్దేశంతోనే యువ సభ్యులను ఎక్కువగా ఎన్నుకోవడం జరిగింది.
 

(వ్యాసకర్త సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు)
ఆర్‌. అరుణ్‌ కుమార్‌

ఆర్‌. అరుణ్‌ కుమార్‌