చికెన్‌లోని విటమిన్స్, మినరల్స్ శరీరానికి కావాల్సిన పోషక విలువలను అందిస్తాయి. చాలామంది చికెన్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్తుంటారు. కానీ, చికెన్‌లో గల పోషకాలు వేరే పదార్థాలలో లభించవు. కనుక ఆహారంలో చికెన్ చేర్చుకోవడం మంచిదనేది నిపుణుల మాట. పిల్లలు మెచ్చేలా చికెన్ స్నాక్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం.
పాప్‌కార్న్
కావాల్సిన పదార్థాలు : చికెన్ ముక్కలు- పావుకిలో, కార్న్‌ఫ్లోర్- రెండు స్పూన్లు, గుడ్డు- ఒకటి, బ్రెడ్‌పొడి- కప్పు, ఉప్పు- తగినంత, అల్లంవెల్లుల్లి- స్పూను, మిరియాలపొడి- పావుస్పూను, కారం- రెండుస్పూన్లు, గరంమసాలా- స్పూను, నూనె- వేయించడానికి సరిపడా.
తయారుచేసే విధానం :
ఓ గిన్నెలో కారం, మిరియాలపొడి, అల్లంవెల్లుల్లి, మసాలా పొడి, ఉప్పు వేసి కలపాలి.
చికెన్‌ని చిన్నచిన్న ముక్కలుగా కోయాలి. వాటిమీద కారం మిశ్రమం చల్లి, ముక్కలకి పట్టేలా బాగా కలిపి, కార్న్‌ఫ్లోర్ కూడా వేసి కలపాలి.
తర్వాత విడిగా ఓ గిన్నెలో గుడ్డు తెల్లసొన, మరో గిన్నెలో బ్రెడ్‌పొడి వేయాలి.
ఒక్కో చికెన్ ముక్కనీ తెల్లసొనలో ముంచి, బ్రెడ్‌పొడిలో దొర్లించి తీయాలి. అలాగే అన్నీ చేయాలి.
ముక్కలు బాగా కరకరలాడాలంటే మరోసారి గుడ్డుసొనలో ముంచి బ్రెడ్‌పొడి అద్దాలి. వాటిని ఓ పావుగంట సేపు పక్కన ఉంచాలి.
పాన్‌లో నూనె వేసి కాగాక కొంచెం కొంచెంగా చికెన్ ముక్కలు వేసి వేయించి తీయాలి.
కట్‌లెట్
కావాల్సిన పదార్థాలు : చికెన్‌ముక్కలు- అరకప్పు, పాలు- రెండు కప్పులు, కొత్తిమీర తరుగు- నాలుగు టీస్పూన్స్, ఉప్పు- రుచికి తగినంత, కార్న్‌ఫ్లోర్- ఆరు స్పూన్లు, జాజికాయ, మిరియాల పొడి- తగినంత, నూనె- పావుకేజీ, కోడిగుడ్డుసొన- నాలుగు గుడ్లది, వెన్న- వంద గ్రాములు, రొట్టె ముక్కలు- రెండు కప్పులు.
తయారుచేసే విధానం :
పాన్‌లో కొద్దిగా వెన్న వేసి, వేడి చేసిన తర్వాత చికెన్ ముక్కలు వేయాలి. అవి బంగారువర్ణం వచ్చేవరకూ వేయించాలి.
తర్వాత అందులోనే పాలు పోసి, అవి మరుగుతుండగా.. కొత్తిమీర, ఉప్పు, జాజికాయ పౌడర్‌లను వేయాలి.
ఓ పొంగు వచ్చేదాకా ఉడికించి కిందకు దించేయాలి. చల్లారిన తర్వాత చికెన్‌ముక్కలను తీసుకుని, ఏదైనా ఒక ఆకారంలో కట్‌లెట్స్‌గా చేసుకోవాలి.
వాటిని కార్న్‌ఫ్లోర్‌లో దొర్లించి, కోడిగుడ్డు తెల్లసొనలలో ఒక్కొక్కటిగా ముంచాలి. ఇంకా రొట్టెముక్కల పొడిలో అద్ది, ప్లేట్‌లో అరగంటపాటు ఉంచాలి.
తర్వాత మరో పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో కట్‌లెట్ ముక్కను వేసి బాగా ఉడికించుకోవాలి. అంతే చికెన్ కట్‌లెట్ రెడీ !
ఎగ్ రోల్
కావాల్సిన పదార్థాలు : చికెన్- 250 గ్రా., గుడ్లు శ్రీ రెండు, ఉల్లిపాయలు - కప్పు, క్యాబేజి - కప్పు, క్యారెట్ - కప్పు, అల్లం వెల్లుల్లిపేస్ట్ - పావుస్పూను, సోయాసాస్ - అరస్పూను, చిల్లీ సాస్ - అరస్పూను, గరం మసాలా - అరస్పూను, నిమ్మరసం - రెండు స్పూన్లు, స్ప్రింగ్ రోల్ వ్రాపర్స్ - ఐదు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె- సరిపడా.
తయారుచేసే విధానం :
ముందుగా పాన్‌లో కొద్దిగా నూనె వేసి, వేడి చేయాలి. అందులో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్, క్యాబేజి తురుము వేసి ఫ్రై చేసుకోవాలి.
గరం మసాలా, సోయాసాస్, చిల్లీ సాస్, నిమ్మరసం వేసి కలిపి, పది నిమిషాలు వేడి చేయాలి.
తర్వాత గ్రైండ్ చేసుకొన్న చికెన్‌ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులోనే గుడ్డు పగులగొట్టి వేసి, బాగా కలపాలి.
ఆ మిశ్రమాన్ని ముందుగా స్టఫ్ కోసం సిద్ధం చేసుకొన్న మిశ్రమంలో వేసి బాగా కలపాలి. మొత్తం మిశ్రమాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి.
తర్వాత స్ప్రింగ్ రోల్ వ్రాపర్‌ను తీసుకొని, ఒక ప్లేట్‌లో సర్దాలి.
ఈ వ్రాపర్‌లో ఒకటి లేదా రెండు చెంచాల చికెన్ స్టఫ్‌ను నింపాలి.
తర్వాత దాని మీద మరో వ్రాపర్‌ను ఉంచి, నీట్‌గా కవర్ చేయాలి.
ఇప్పుడు మరో పాన్‌లో నూనె వేసి కాగిన తర్వాత, అందులో చికెన్ రోల్స్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.
ఒకదాని తర్వాత ఒకటిగా మొత్తం రోల్స్‌ను డీఫ్ ఫ్రై చేస్తూ బంగారు వర్ణం వచ్చేవరకు ఉంచాలి.
తర్వాత వాటిని సర్వింగ్ ప్లేట్‌లోనికి తీసుకోవాలి. అంతే చికెన్ ఎగ్ రోల్స్ రెడీ. . వీటిని చిల్లీ సాస్‌తో
సర్వ్ చేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది.
టిక్కా
కావాల్సిన పదార్థాలు : చికెన్ - 500 గ్రా., బాదం పప్పు - 30 గ్రా., క్రీమ్ - 10 గ్రా., చీజ్ - 10 గ్రా., గట్టి పెరుగు - 50 గ్రా., పచ్చిమిర్చి - 25 గ్రా., యాలకుల పొడి - స్పూన్., మిరియాల పొడి - స్పూన్, అల్లంవెల్లుల్లి పేస్ట్ - స్పూన్, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా, నెయ్యి - రెండు స్పూన్స్, చాట్ మసాలా - స్పూన్.
తయారుచేసే విధానం :
ముందుగా బాదం పప్పులను నానబెట్టి పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చినీ మెత్తగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు మరో గిన్నెలో క్రీమ్, చీజ్ వేసి అందులో పెరుగు, బాదం పేస్ట్, యాలకుల పొడి, మిరియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె వేసి బాగా కలపాలి.
కట్ చేసుకున్న చికెన్ ముక్కలను ఆ మిశ్రమంలో కలిపి అరగంట పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తరువాత తందూరీలో కుక్ చేసుకోవాలి.
ఇలా చేయలేని వాళ్లు పాన్‌లో నూనెను పోసి, వేడయ్యాక చికెన్ ముక్కలు ఫ్రై చేసుకోవచ్చు. చివరగా నెయ్యి, చాట్ మసాల్ వేసి సర్వ్ చేయాలి. అంతే టేస్టీ అండ్ హెల్తీ చికెన్ టిక్కా రెడీ.