ప్రజాశక్తి - రేపల్లె
ఆశ చూపి మోసం చేసే కేటుగాళ్లకు కొదవ లేదు. అలాంటి మోసమే పట్టణంలో చోటు చేసుకుంది. పొదుపు సంఘాల మహిళల పేరుతో రూ.72లక్షలకు మెప్మా సిబ్బంది టోపీ పెట్టారు. మెప్మా కార్యాలయంలో అవినీతి మీద జరుగుతున్న చర్చల్లో కొత్త కోణం వెలుగు చూసింది. గత ఐదు నెలలుగా అవినీతి జరిగిందని అధికారులకు తెలిసినా తెలియనట్లే ఉన్నారు. మోసపోయిన మహిళల మీద బ్యాంకర్ల ఒత్తిడి ఎక్కువ కావడంతో చేసేదేమీ లేక సిపిఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్‌ను మహిళలు ఆశ్రయించారు. మోసపోయిన మహిళలను కలుపుకొని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాఆరు. ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాల ద్వారా బాధిత మహిళల సమస్యలను వివరించారు. మండలంలోని బేతపూడి పంచాయితీ జాషువా నగర్‌కు చెందిన కె సువార్త కుమారి చిట్టీ పాటలు నిర్వహించేది. చిట్టీలు కట్టని వారిపై అనేక పర్యాయాలు దాడులకు పాల్పడిన ఘటనలు మెండుగా ఉన్నాయి. ఈమె అమాయకులపై భౌతిక దాడులు చేయడంతో కొంతమంది ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో చిటీ పాటలు వేసి ఈ ప్రాంత ప్రజలను నమ్మించి నిలువునా ముంచింది. చీట్టీల పేరుతో సుమారు రూ. కోటి వరకు ఎత్తి ఐపి పెట్టింది. తను ఇబ్బందుల్లో ఉన్నానని మాయమాటలు చెప్పి 21వ వార్డు యానిమేటరు మున్నీని తాను కట్టుకుంటానని నమ్మించింది. మెప్మాలో నకిలీ గ్రూపులకు తెరతీసింది. తొలుత తనకు సన్నిహితంగా ఉన్న నిరక్షరాస్యులైన పేద మహిళలను గ్రూపుగా ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అప్సానా మహిళ సంఘం పేరుతో రూ.10లక్షలు షాహీన గ్రూపు పేరుతో రూ.10లక్షలు, రోషిణి గ్రూపు పేరుతో రూ. 6లక్షలు, అప్సరా గ్రూపు పేరుతో రూ.4లక్షలు తొలి విడతగా రుణాలు తీసుకుంది. ఆ తరువాత అవే గ్రూపుల పేరుతో కెనరా బ్యాంకులో రూ.8లక్షలు, బ్యాంకు ఆఫ్ బరోడాలో రూ.3.5లక్షలు, హెడిఎఫ్‌సి బ్యాంకులో రూ.2.5లక్షలు రుణాలు తీసుకుంది. ఫాతీమ గ్రూపు పేరుతో బ్యాంకు ఆఫ్ ఇండియాలో రూ. 4లక్షలు, ఎస్‌బిఐలో రామకృష్ణ గ్రూపు పేరుతో రూ.10లక్షలు, కెనరా బ్యాంకులో కరీముల్లా గ్రూపు పేరుతో రూ.9లక్షలు, సాబీర గ్రూపుతో రూ.5లక్షలు తీసుకుంది. బ్యాంకుల వారు రుణాలు తీసుకున్న వారికి నోటీసులు పంపటంతో మహిళలు రోడ్డు ఎక్కారు. సువార్తకు రుణాలు ఇప్పించిన యానిమేటర్ మున్నీ పలుమార్లు రుణాలు చెల్లించాలని అడిగటంతో మున్నీపై గొడవకు పూనుకుంది. తనపేరు బయటకు వస్తే అంతుచూస్తాని బెదిరింపులకు పాల్పడుతుందని భాదితులు వాపోతున్నారు. మున్నీపై నలువైపులా వత్తిడి పెరగటంతో ఆమె ఊరు వదిలి వెళ్ళింది. పేద మహిళల పేరుతో అక్రమ రుణాలు తీసుకుని మోసం చేసి పారిపోయిన మెప్మా ఆర్పీ, అప్పటి సిబ్బందిపై, ఆర్పీ కుటుంబ సభ్యులుపై పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళాసంఘం, సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ ఆధ్వర్యంలో రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై అబ్దుల్ రజాక్‌ను మోసపోయిన డ్వాక్రా గ్రూపు సభ్యులందరూ కలిసి ఉమ్మడిగా కోరారు. ఈ నేపథ్యంలో మున్నీని అడ్డుపెట్టుకుని బ్యాంకులను అడ్డంగా దోచిన సువార్తపైన కేసు నమోదు చేయాలని పలువురు గ్రూపు సభ్యులు డిమాండ్ చేశారు. సువార్త మాయ మాటలు చెప్పి రూ.5వేలు రుణాలు ఉచితంగా ఇప్పిస్తానని మోసం చేసిందని బాధిత మహిళలు వాపోతున్నారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి మోసం చేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తే కొంత మేర బ్యాంకు రుణాలు జమ చేయవచ్చని బాధిత మహిళలు తెలిపారు.










