Sep 01,2023 23:21

ప్రజశక్తి - చీరాల
పట్టణంలోని అసోసియేషన్ బిల్డింగ్ సమీపంలో ఓ యువకుడిని కొందరు వ్యక్తులు కారులో బలవంతంగా తీసుకువెళ్ళటంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురైన ఘటనతో శుక్రవారం కిడ్నాప్ కలకలం రేగింది. బందావారివీధికి చెందిన రవి తేజ అనే యువకుడు మరికొందరితో జతకట్టి తెనాలి, విజయవాడ ప్రాంతాల్లో బంగారం, వెండి వస్తువులను అరువుగా తీసుకొచ్చి చీరాల పరిసర ప్రాంతాల్లో ప్రముఖులకు కొన్నవాటి కన్నా తక్కువ ధరలకే విక్రయించారు. కొనుగోలు చేసిన వ్యాపారులకు డబ్బులు చెల్లించకపోవటంతో సుమారు సంవత్సరం క్రితం ఆ యువకుడిపై చీరాల ఒకటో పట్టణ స్టేషన్లో కొందరు బాధితులు ఫిర్యాదు చేశారు. అప్పట్లో అది చీరాల్లో హాటాపిక్ గా మారింది. ఈ క్రమంలో తెనాలికి చెందిన ఓ వ్యాపారి తన వద్ద వెండి వస్తువులను తీసుకుని తిరిగి డబ్బులు చెల్లించకుండా మోసం చేశారని తెనాలి రెండో పట్టణ స్టేషన్లో చీరాల యువకుడిపై ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగా శుక్రవారం కారులో తెనాలికి చెందిన కొందరు పోలీసులు వచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషను తీసుకెళ్లారు. అయితే మొదట్లో యువకుడి కుటుంబ సభ్యులు, స్థానికులు మాత్రం కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని అనుకోగా అనంతరం వారు పోలీసులని తెలియటంతో కొంత ఊపిరిపీల్చుకున్నారు.
తీసుకువెళ్లింది పోలీసులే : వన్టౌన్ సీఎం
రవితేజ అనే యువకుడుని తన ఇంటి వద్ద నుండి కారులో తీసుకువెళ్ళింది పోలీసులేనని చీరాల ఒకటవ పట్టణ సీఐ మల్లికార్జునరావు స్పష్టం చేశారు. కిడ్నాప్‌ వంటి వదంతులు నమ్మవద్దని తెలిపారు.