Nov 03,2023 00:01

- పట్టణంలో మౌలిక వసతులు మెరుగుపర్చాలి
- భరోసా పత్రాలు కాదు నివాస స్థలాలు ఇవ్వండి
- పోస్టర్‌ ఆవిష్కరించిన సిపిఎం నేతల డిమాండ్‌
- నవంబరు 3, 4తేదీలలో పాదయాత్రలు
ప్రజాశక్తి - చీరాల
స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఘనమైన చరిత్ర వహించిన చీరాల పట్టణం అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉందని సిపిఎం పట్టణ కార్యదర్శి ఎన్‌ బాబురావు పేర్కొన్నారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధికి నోచుకోకపోగా ఐఎల్టిడిలో కార్మికులు రెండు వేలకు తగ్గించబడ్డారని అన్నారు. స్పిన్నింగ్‌ మిల్లు, బ్రహ్మాస్ మూత పడ్డాయని అన్నారు. 1985నుండి ఆటోనగర్ పునాదిరాళ్లకే పరిమితమైందని అన్నారు. వాడరేవులో పోర్టు కలగాలనే మిగిలిందని అన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల చేనేత రంగం కుందేలై ఉపాధి కల్పించలేని పరిస్థితి నెట్టబడిందని అన్నారు. ఒకప్పుడు పరిశ్రమల కేంద్రమైన చీరాల ప్రస్తుతం ఉపాధి కోసం వలసలు పోయే స్థితిలో ఉందని అన్నారు. అందువల్ల చీరాలను పారిశ్రామికవంతం చేయాలని, ప్రజలకు ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. పట్టణంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందన్నారు. మురుగు కాల్వలు అస్తవ్యస్థంగా నిర్మించడం వల్ల పారుదల లేక మురుగు నిలిచి అంటు రోగాలు వ్యాపిస్తున్నాయని అన్నారు. సంవత్సరం పొడవునా దోమల బెడద తప్పటం లేదని అన్నారు. డ్రైన్లు ఆధునికరించి కుందేరుకు అనుసంధానం చేయాలని కోరారు. కుందేరుకు పారుదల కల్పించాలని కోరారు. కుందేరు మిగులు భూముల్లో పేదలకు భరోసా పత్రాలకు బదులు నివాస స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. లింకు రోడ్లు అభివృద్ధి చేయాలని అన్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని అన్నారు. చీరాల కంటే వెనక మున్సిపాలిటీలైన పట్టణాలు నగరాల స్థాయికి వచ్చాయని అన్నారు. చీరాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కోరుతూ సిపిఎం నవంబర్ 3, 4 తేదీలలో పట్టణంలో పాదయాత్ర నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను, సమస్యలను తెలుసుకొని రాబోయే కాలంలో ఆందోళన, పోరాటాలు చేయడానికి సిపిఎం కృషి చేస్తుందని అన్నారు. పాదయాత్రలు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 8న రాష్ట్ర అభివృద్ధి, విభజన హామీలు అమలు చేయాలని, రాష్ట్రంలో కరువు మండలాలను వెంటనే ప్రకటించాలని, సాగునీరు తాగునీరు సమస్యలు పరిష్కరించాలని, ఎస్‌టి, ఎస్‌సి, బీసీల సంక్షేమానికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, నిరుద్యోగ సమస్యపై రాష్ట్ర బస్సు జాతా వస్తుందని తెలిపారు. చీరాల గడియార స్తంభం సెంటర్లో జరిగే బహిరంగ సభకు జయప్రదం చేయాలని కోరారు. ఈ బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, డి రమాదేవి, కేంద్రకమిటి సభ్యులు ఎంఎ గఫూర్‌ పాల్గొంటున్నారని తెలిపారు. విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు పి కొండయ్య, ఎం వసంతరావు, ఎల్ జయరాజు పాల్గొన్నారు.