ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్)లో పరిశుభ్రతపై సూపరింటెండెంట్ డాక్టర్ వై.కిరణ్‌కుమార్ దృష్టి సారించారు. శుక్రవారం ఆయనే స్వయంగా చీపురుపట్టి ఊడ్చారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యే ముస్తఫా ఉచిత మినరల్ వాటర్ వద్ద అపరిశుభ్రంగా ఉన్న వాతావరణాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన సూపరింటెండెంట్ స్వయంగా చీపురుమట్టి ఊడ్చారు. బండలను కడిగి శుభ్రపర్చారు. ఆస్పత్రిని దేవాలయంగా మార్చండి.. బూత్ బంగ్లాగా మార్చొద్దు అని అధికారులపై మండిపడ్డారు. ఆస్పత్రిలో దుకాణాలను తనిఖీ చేసి అధిక ధరలకు విక్రయిస్తే సహించనని చెప్పారు. సంగం డెయిరి షాపులో అధిక రేట్లకు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఆసుపత్రి ప్రవేశ ద్వారం వద్ద ఆక్రమణలను తొలగించాలన్నారు. ఆసుపత్రిలో అస్తవ్యస్తంగా మారిన పార్కింగ్‌పై మండిపడ్డారు. ఆసుపత్రి ఎదురుగా ఉన్న రైల్వే స్టేషన్లో పార్కింగ్ ఎలా ఉంది. మన దగ్గర ఎలా ఉంది.. అంటూ సెక్యూరిటీ సూపర్‌వైజర్లను ప్రశ్నించారు. ఎవరి వాహనాలైనా పార్కింగ్ ప్రదేశాల్లో పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. వాహనాలన్నీ ఆసుపత్రి ప్రహరీకి ఆనుకుని ఉన్న ప్రదేశాల్లో పార్క్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎంఒను ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసు, కొత్తపేట పోలీసులతో ఆయన మాట్లాడారు. ఆసుపత్రి ఆవరణలోని విద్యుత్ శాఖ కార్యాలయాన్ని సందర్శించి విద్యుత్ హెచ్చు తగ్గులు వస్తున్నాయని, సరి చేయాలని ఆదేశించారు. యూనియన్ నాయకులు ఎవరికి వారే షెడ్‌లు వేసుకోవడంపై అభ్యంతరం తెలిపారు. మార్చురి వద్ద అడ్డంగా పెట్టిన ప్రైవేట్ అంబులెన్స్‌లను తొలగించాలని ఆదేశించారు. మహాప్రస్థానాల నిర్వహణను ఆర్‌ఎంలకు కేటాయించాలని సివిల్ సర్జన్ ఆర్‌ఎంఒ డాక్టర్ సతీష్‌కుమార్‌ను ఆదేశించారు. వాహనాలు ఎప్పుడు బయటకు వెళ్లుతున్నాయో వాటిపై నిఘా పెట్టాలన్నారు. సూపరింటెండెంట్ వెంట సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఆర్‌ఎంఒ వై.రమేష్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సజని, పరిపాలన అధికారి ప్రవీణ్ కుమార్ ఉన్నారు.










