Aug 13,2023 21:34

చీనీ ధరలు పతనం

ప్రజాశక్తి - సింహాద్రిపురం
ఈ ఏడాది సీజన్‌లో చీనీ కాయల ధరలు అమాంతంగా తగ్గిపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో చీనీ తోటలు పెంపకానికి ప్రసిద్ధి. ఈ మం డలంలో దాదాపు 8 వేల హెక్టార్లలో పంట సాగులో ఉంది. ప్రతి ఏడాదీ ఈ సీజన్‌లో దాదాపు 80 వేల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఉద్యాన శాఖ అధికారులు చెబు తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ధరలు గణనీయంగా పడిపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనం తపురం, బెంగళూరు మార్కెట్లలో టన్ను ధర రూ. 20 వేల నుంచి రూ. 25 వేల లోపే ధరల్లో పలుకుతున్నాయని రైతులు చెబుతున్నారు. ఈ ధరలకు చీనీకాయలు విక్రయిస్తే పెట్టిన పెట్టుబడులు సైతం రావని రైతులు ఆవేదన చెందుతున్నారు.
పులివెందుల మార్కెట్‌పై రైతుల ఆశలు
ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో గత ఏడాది చీనీకాయల మార్కెట్‌ అటహాసంగా ప్రారంభించారు. అనతి కాలంలోనే రైతులకు సరైన ధరలు లభించకపోవడంతో తమ ఉత్పత్తులను తీసుకెళ్లకపోవడంతో మార్కెట్‌లో వ్యాపారాలు నిలిచిపోయాయి. ఈ ఏడాది లోకల్‌ వ్యాపారులను కాకుండా ప్రముఖ కంపెనీలను ఆహ్వానించి వారిచేత చీని కాయలు కొనుగోలు చేసేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
సూట్‌ పేరుతో మోసపోతున్న రైతులు
రైతులు తమ తోటల వద్ద చీనీ కాయలు విక్రయించాలంటే ప్రతి పది టన్నులకు 2.5 టన్నులు సూటు పేరుతో ఉచితంగా వ్యాపారులకు ఇవ్వాల్సి వస్తుంది. ఈ సూట్‌ను నియంత్రించడానికి పలుమార్లు ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లినా ఏ మాత్రం ప్రయోజనం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు సూటు నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
సూట్‌ నియంత్రించేలా చర్యలు చేపట్టాలి
అధికారులు, రాజకీయ నాయకులు చీనీ కాయల కొనుగోలులో సూట్‌ నియంత్రించేలా చర్యలు తీసుకోవాలి. సూటు పేరుతో వ్యాపారులు మోసం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుని న్యాయం చేయాలి.
-గంగాధర్‌రెడ్డి, చీనీ రైతు, గురజాల.
కనీస మద్దతు ధర ప్రకటించాలి
టన్ను చీనీ కాయలు కనీసం మద్దతు ధర రూ. 50 వేలు ప్రకటించాలి. దీంతో పెట్టుబడులు పోను కొంతమేర ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కావున ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలి.
-గోపాల్‌ రెడ్డి, చీని రైతు, గురజాల.
ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్తా...
ప్రస్తుతం మార్కెట్లో చీనీ కాయలు ధరలు తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కొనుగోలులో సూట్‌ను నియంత్రించేలా ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం జరిగేలాగా చూస్తా.
-మల్లేశ్వర్‌రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి, ముద్దనూరు.