Jan 10,2023 22:47

ప్రజాశక్తి - ఏలూరు
          రోడ్లు, ప్రధాన కూడళ్లలో ప్రదర్శనలు, సభలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఒ నెం.1ని తక్షణం రద్దు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ధర్నానుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడానికి పాదయాత్రలు, సభలు, ర్యాలీలు నిర్వహించలేదా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక గతాన్ని మరించి జిఒ నెం.1ని తీసుకురావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్మికులు, ఉద్యోగులను అణచివేసే చర్యలు ఆపి సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో రానున్న కాలంలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జగన్నాధరావు, సాయిబాబు, నాయకులు ప్రసాద్‌, సీతయ్య, జాన్‌బాబు, గోపీ, లావేటి కృష్ణ, దుర్గారావు, నాగమణి, కోటేశ్వరరావు పాల్గొన్నారు.
నూజివీడు: జిఒ నెం.1ని రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక చిన్న గాంధీబొమ్మ సెంటర్‌ వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నేత జి.రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిఒ నెం.1ని తక్షణం రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు హనుమాన్‌, కమలకుమార్‌, శ్రీనివాస్‌, మరిదాస్‌ దుర్గ, నాగమణి, పద్మాంజలి తదితరులు పాల్గొన్నారు.
నిడమర్రు: జిఒ నెం.1ని వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నిడమర్రు సెంటర్లో జిఒ నెం.1 ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో కోన శ్రీనివాసరావు, సంకెళ్లు మోహన్‌రావు, గవర సత్యనారాయణ, అంబల సాయిగణేష్‌, వెలగలేటి మోహన, లావేటి దుర్గారావు, కారు బుజ్జి, శోభన్‌ బాబు, కొప్పుల శ్రీనివాసు పాల్గొన్నారు.
చింతలపూడి: జిఒ నెం.1కి వ్యతిరేకంగా నిరసన చేపట్టకుండా సిఐటియు నాయకుల అక్రమ నిర్బంధం ప్రభుత్వానికి సిగ్గుచేటు అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌విఎస్‌.సత్యనారాయణ అన్నారు. సిఐటియు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు స్థానికంగా ఆందోళన చేపట్టకుండా నారాయణను పోలీసులు గృహనిర్బంధం చేశారు. దీన్ని ఆయన ఖండించారు. శాంతియుతంగా నిరసన కూడా తెలియజేయకుండా అడ్డుకోవడం నియంతృత్వ పాలనకు నిదర్శనమని ఆయన విమర్శించారు.
వేలేరుపాడు: జిఒ నెం.1ని రద్దు చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మడివి దుర్గారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం స్థానిక అంబేద్కర్‌ సెంటర్‌లో జిఒ నెం.1 ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మడివి దుర్గారావు మాట్లాడారు. కార్యక్రమంలో నేతలు ధర్ముల రమేష్‌, వెంకటేశ్వర్లు, ఫ్రెండ్స్‌ ఆటో యూనియన్‌ అధ్యక్షులు కురిమెళ్ల శ్రీను, కార్యదర్శి మజ్జి శ్రీను, అఫ్రోజ్‌, రమేష్‌, లక్ష్మణ్‌ ఆది, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.