Nov 05,2022 21:38

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో రోగుల పట్ల సిబ్బంది దురుసు ప్రవర్తన
ఎక్సరే వార్డులో ఇదీ తీరు
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌

రోగుల పట్ల సహనంతో మెలగండి.. వారిని ప్రేమగా పలకరించండి.. వారి సమస్య తెలుసుకుని పరిష్కరించండి.. ఇదీ ఏలూరులోని ప్రభుత్వాసుపత్రి అధికారులు ప్రతీరోజు సిబ్బందికి చెప్పే మాటలు.. కానీ ఆచరణలో మాత్రం అవి నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. ఆసుపత్రికి వచ్చే రోగులపట్ల కొందరు సిబ్బంది అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. దీనికి ఎక్స్‌ రే వార్డు ఉదాహరణగా నిలుస్తోంది. శనివారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎక్స్‌ రే తీయించుకునేందుకు వచ్చారు. వారిపట్ల మర్యాదగా ప్రవర్తించాల్సిన ఎక్స్‌ రే వార్డులోని కొందరు సిబ్బంది వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం రోగులను విస్మయానికి గురిచేసింది. రోగులపై పెద్ద పెద్దగా అరవడంతోపాటు వారిని చిన్న బుచ్చేలా మాటలతో వ్యవహరించారని పలువురు రోగులు వాపోయారు. వారికి తెలిసిన వారిని మాత్రం క్యూలైన్‌ అవసరం లేకుండానే ఎక్స్‌ రేలు తీశారని తమను మాత్రం గంటలకొద్దీ ఎక్స్‌ రే వార్డు దగ్గర పడిగాపులు పడేలా చేశారని పలువురు వాపోయారు. సాక్షాత్తు ఆసుపత్రి సూపరింటెండెంట్‌, ఆర్‌ఎంఒ కార్యాలయాల సమీపంలోనే ఉన్న ఎక్స్‌ రే వార్డు వద్ద పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన వార్డుల్లో పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వారి సహాయకుల పట్ల సిబ్బంది మర్యాదగా ప్రవర్తించాలని పలువురు కోరుతున్నారు.