ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్ సాగుపై రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే వరి విత్తనాలు వేసిన ఆకు మడులకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని అన్నదాతలు అంటున్నారు. ఇంతవరకు వరి ఆకుమడులు పోయని రైతులు, విత్తనాలు చల్లడానికి సన్నద్ధం అయ్యారు. రానున్న వారం పది రోజుల్లో భారీ వర్షాలు కురిసి చెరువులు, రిజర్వాయర్లలో నీరు చేరి, నదుల్లో వరద ప్రవాహనం పెరిగితే ఖరీఫ్ వరి సాగుకు డోకా ఉండదని రైతులు అంటున్నారు.
పసిఫిక్ మహాసముద్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా వర్షాలు సాధారణం కన్నా తక్కువ కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఈ మాదిరిగానే గత రెండు నెలల నుంచి జిల్లాలో వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎండలు తీక్షణంగా కాయడం, నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడం, అవి కూడా బలహీనంగా పండడంతో జూన్‌లో సాధారణ వర్షపాతంలో సగమే కురిసింది, జూలై మొదటి వారంలో కూడా ఇవే పరిస్థితులు కొనసాగడంతో ఖరీప్ సాగుపై నీలినీడలు అలముకున్నాయి. వరి నాట్లు వేసే సమయం దగ్గరపడుతున్నప్పటికీ ఇంకా నారుమడుల్లో విత్తనాలు చల్లలేని పరిస్థితి నెలకొంది. గత నెలాఖరులో చెదురుమదురుగా కురిసిన వర్షాలతో కొంతమంది రైతులు నారుమడుల్లో వరి విత్తనాలు చల్లారు. మొలకలు వచ్చినప్పటికీ తరువాత వర్షాలు మొహం చాటేశాయి. దీంతో నారు మొక్కలు ఎండి పోతుండడంతో రైతులు అందోళన చెందారు. మిగిలిన రైతులు విత్తనాలు చల్లడానికి వెనుకంజ వేశారు. ఇటువంటి తరుణంలో మూడు. రోజుల నుంచి వాతావరణం మారిపోయి వర్షాలు కురుస్తుండడంతో ఖరీఫ్ సాగుపై అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. ఆకు మడులకు ఈ వర్షం ఊపిరిపోయగా, మిగిలిన రైతులు మడులు సిద్ధం చేసుకొని విత్తనాలు చల్లుతున్నారు. పిఠాపురం, సామర్లకోట, తుని, జగ్గంపేట నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు దఫదఫాలుగా భారీ వర్షం పడడంతో పొలాల్లో నీరు చేరింది. ఇప్పటికే వేసిన చిరుధాన్యాలు, పప్పుదినుసులు, కూరగాయలు, నూనెగింజల పంటలకు ఈ వర్షం ఎంతో మేలు చేస్తుందని రైతులు చెబుతున్నారు.










