ఇక్కడ వగరు, ఉప్పున, పులుపు మనసుల
వాళ్ళుంటారు..
అలజడి అజ్ఞాత వ్యక్తులు
నిత్యం వెంబడిస్తుంటారు
తియ్యటి స్వేచ్ఛకు కోత పెట్టేచోట..
అనుభూతుల చేదును
ఆరోగ్యసూత్రంగా.. మలచగలిగిన చోట
చివుళ్ళ చివరల్లో.. భవితల్ని
కారంగా వేలాడేసుకున్న వాళ్ళం
మనిషైనా..మానైనా
కలల ఆకులు రాలిపోతుంటే
బతకనేర్చిన కోయిలలొచ్చి
పాడితేనే వసంతమా?
రక్తతర్పణ కోరని
నక్షత్ర గమనం కావాలిప్పుడు
ఆకలి గీతాన్ని రాసుకోమనో..
కన్నీటి చిత్రాన్ని గీసుకోమనో..చెప్పకు
తల్లివో..చెల్లివో..ప్లవనామవత్సరమా..
ఏదైనా కొత్తగా చెప్పు
అయినా చైత్రమే చెట్టుకు మాటిచ్చాక
శిశిర వేదనెందుకు?
చిగుళ్ళగూర్చి చింతెందుకు?
ప్రతి వసంతం చెప్పేదొకటే..
వాడి రాలినా చిగురించమనే..
విత్తై మరణించినా
మొక్కై మొలవమనే
- దారల విజయకుమారి
9177192275