తెల్లారంతా తనిఖీ చేస్తూనే ఉన్నాను
కూనిరాగాలు తీయని విలాపం గీతాన్ని
వెలుతురులోను నిశీధి నింపుకున్న విషాదం
నయా వంచిత విధి విలాపం కాదా
కకావికలమైన కలల తీరం మీద
కాలుతున్న శవాల దిబ్బలు దేనికి దర్పణం
చివరి చూపు కూడా నోచుకోని చితిమీద దేహం ఓడిపోయి ఒంటరైనదే కదా
సుదీర్ఘంగా పరుచుకున్న ఈ చీకటి దుప్పటిలో
కన్నీళ్లు కత్తులను పట్టుకొని కళ్ళను పొడుస్తుంటే
తలగడ ఎన్ని కలల ధైర్యం నూరిపోస్తేనో కానీ
ఈ నయనం తెరుచుకోదు
ఏ విషాదం లేని రేపు
తెల్లగా తెల్లవారితే చూడాలని ఆశ
దగాపడ్డ ఏ దేహం దగ్ధం అవ్వకుండా
ఏ విషాదం లేని వసంతం
ఆశగా మళ్ళీ చిగురించాలని ఉంది
ఈ కటిక చీకటి ఒక కలై కరిగిపోతే బాగుండు
ఎవరైనా ఈ నిశీధిని కాస్త కదిలించి నిద్రలేపండి
- పి.సుష్మ
9959705519